కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందన్న వార్తను హోంశాఖ వర్గాలు తోసిపుచ్చాయి. ఆయనకు ఎలాంటి టెస్టులు నిర్వహించలేదని, ఆ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు.

ఒకవేళ పరీక్షలు చేసినట్లయితే తామే ఆ వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు. అమిత్ షా ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి అసత్యాలూ ప్రచారం చేయొద్దని సూచించారు.

కాగా కోవిడ్ నుంచి అమిత్ షా కోలుకున్నారంటూ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ తెలియజేశారు. కోవిడ్ చికిత్స పొందుతున్న అమిత్ షాకు మరోసారి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్ చేశారు. అయితే హోంశాఖ వర్గాల వివరణ తర్వాత మనోజ్ తన ట్వీట్‌ను తొలగించారు.

కాగా, ఆగస్టు 2న జరిపిన కరోనా పరీక్షల్లో అమిత్ షాకు పాజిటివ్ ఫలితం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వైద్యుల సలహా మేరకు గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. వారం రోజుల తర్వాత ఆయన కోలుకున్నారు. మరోవైపు అమిత్ షాను కలిసిన వారంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.