పాట్నా: ఎన్డీఏ శాసనసభపక్ష నేతగా ఎన్నికైన తర్వాత నితీష్ కుమార్ ఆదివారం నాడు బీహార్ గవర్నర్ పగ్ చౌహాన్ ను కలిశారు.

ఎన్డీఏలోని నాలుగు పక్షాలు తనకు మద్దతు ఇస్తున్న విషయాన్ని నితీష్ కుమార్  గవర్నర్ కు అందించాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మద్దతు ఉందని నితీష్ కుమార్ గవర్నర్ కు వివరించారు. ఈ మేరకు తనకు మద్దతు ఇస్తున్న పార్టీల లేఖలను అందించారు. ముఖ్యమంత్రిగా గవర్నర్ ఆదేశాల మేరకు రేపు ప్రమాణం చేస్తానని ఆయన ప్రకటించారు. 

also read:ఎన్డీఏ పక్షనేతగా నితీష్‌కుమార్ ఎన్నిక: రేపు బీహార్ సీఎంగా ప్రమాణం

గవర్నర్ తో భేటీ ముగిసిన తర్వాత నితీష్ కుమార్ రాజ్ భవన్ వెలుపల మీడియాతో మాట్లాడారు.నవంబర్ 16వ తేదీన రాజ్ భవన్ లో తాను ప్రమాణస్వీకారం చేస్తానని ఆయన చెప్పారు. నితీష్ తో పాటు ప్రమాణం చేసే కేబినెట్ ఆ తర్వాత సమావేశం కానుంది.

అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడంపై  కేబినెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఎన్నికల్లో జేడీ యూ కంటే బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకొంది. అయితే కేబినెట్ లో తమకు ఎక్కువ స్థానాలు ఇవ్వాలని బీజేపీ కోరినట్టుగా ప్రచారం సాగుతోంది. 

అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయమై నితీష్ కుమార్ ను ప్రశ్నిస్తే  అన్ని విషయాలు పరిష్కరించబడుతాయని ఆయన చమత్కరించారు.నితీష్ కుమార్  రాజ్ భవన్ నుండి బయటకు వచ్చిన కొద్దిసేపటి తర్వాత  బీజేపీ నేతలు గవర్నర్ ను కలిశారు.

బీహార్ సీఎంగా నితీష్ కుమార్ వరుసగా నాలుగో సారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. రేపు ప్రమాణం చేయగానే నితీష్ కుమార్ ఏడుసార్లు బీహార్ సీఎంగా పనిచేసినట్టుగా రికార్డు సృష్టించనున్నారు.