బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వతహాగా చాలా నిదానస్తుడు. ముఖంపై చిరు నవ్వుతో ప్రత్యర్ధులకు సైతం చాలా కూల్‌గా కౌంటర్లు ఇస్తారన్న పేరుంది. అలాంటి నితీశ్‌కుమార్‌ బీహార్ ఎన్నికల ప్రచారంలో సహనం కోల్పోతున్నారు.

తాజాగా ఆయన మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పర్భట్టాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ప్రత్యర్థి, ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్‌పై పదునైన బాణాలు ఎక్కుపెట్టారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్‌జేడీ కూటమి అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తేజస్వియాదవ్‌ 10 లక్షల ఉద్యోగాలు అన్న మాట కేవలం బోగస్‌ అని నితీశ్‌ కుమార్‌ విమర్శించారు. 

రాష్ట్రాన్ని 15 ఏళ్ల పాటు పాలించిన లాలూ కుటుంబం ఆ సమయంలో బిహార్‌ను ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని నితీష్‌ కుమార్‌ ఆరోపించారు. వారి హయాంలో కేవలం 95,000 ఉద్యోగాలు‌ మాత్రమే ఇచ్చారన్నారు.

తాము అధికారంలోకి వచ్చాక ఆరు లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆర్జేడీ చెప్పేదంతా బోగస్‌ మాటలేనని ఆయన కొట్టిపడేశారు. మరోవైపు ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి కూడా నాలుగు లక్షల గవర్నమెంట్‌ ఉద్యోగాలు, 15 లక్షల ఇతర ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తేజస్విపై నితీశ్ కుమార్ వ్యాఖ్యల నేపథ్యంలో పలువురు నేతలు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. ఎన్డీఏ కూటమి ఇచ్చిన 15 లక్షల ఉద్యోగాల హామీని ఐదోసారి బిహార్‌కు ముఖ్యమంత్రిగా పనిచేస్తోన్న నితీశ్ ‌కుమార్‌ మర్చిపోయారేమో అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

లాక్‌డౌన్‌ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిన నేపథ్యంలో బిహార్‌ ఎ‍న్నికల్లో ఉద్యోగ ప్రకటన కీలక పాత్ర పోషించనుంది. ఇక బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ బుధవారం ముగిసిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు నవంబర్‌10వ తేదీన వెలువడనున్నాయి