న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితిపై భర్త పరకాల ప్రభాకర్ చేసిన విమర్శలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. అయితే, పరకాల ప్రభాకర్ విమర్శలకు సీతారామన్ సూటిగా స్పందించలేదు. 

2014 నుంచి 2019 వరకు మౌలిక సంస్కరణలను చేపట్టింది మోడీ ప్రభుత్వమేనని ఆమె అన్నారు. జీఎస్టీ, ఆధార్, వంటగ్యాస్ పంపిణీ వంటి చర్యలను మోడీ ప్రభుత్వమే తీసుకుందని ఆమె గుర్తు చేశారు ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి దేశం గట్టెక్కాలంటే పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ విధానాలే శరణ్యమని పరకాల ప్రభాకర్ అన్నారు. 

ఓ అంగ్ల దినపత్రికలో మోడీ ఆర్థిక విధానాలను విమర్శిస్తూ పరకాల ప్రభాకర్ రాసిన వ్యాసం చర్చనీయాంశంగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తోందని, ఒకదాని తర్వాత మరో రంగం పెను సవాళ్లను ఎదుర్కుంటున్నాయని, ఈ విషయాన్ని గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని ఆయన అన్నారు. అయినా దాన్ని అంగీకరించేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదని అన్నారు. 

మోడీ ఆర్థిక విధానాలను రాజకీయ కోణంలో విమర్శించడం తప్ప బిజెపికి సొంత విధానమేదీ లేదని ఆయన అన్నారు. ఆర్థిక విధానాలకు సంబంధించి ఇది కాదు, ఇది కాదు అనడమే తప్ప ఏదీ ఉండాలనే స్పష్టత మోడీ ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు.