న్యూఢిల్లీ: దోషులకు పాటియాలా హౌస్ కోర్టు కొత్త డెత్ వారంట్ జారీ చేసిన విషయంపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. తాను అంత సంతోషంగా ఏమీ లేనని, దోషులకు డెత్ వారంట్ జారీ చేయడం  ఇది మూడోసారి అని ఆమె అన్నారు. తాము ఎంతో ఆవేదనకు గురయ్యామని చెప్పారు.

చివరకు డెత్ వారంట్ జారీ అయినందుకు ఆనందంగా ఉందని, మార్చి 3వ తేదీన దోషులకు ఉరిశిక్ష అమలు చేస్తారని తాను ఆశిస్తున్నానని ఆశాదేవి అన్నారు. మార్చి 3వ తేదీన నిర్భయ కేసు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసింది.

Also Read: నిర్భయదోషులను ఉరితీయడానికి మరోసారి "ముహూర్తం" ఫిక్స్... కొత్త డెత్ వారెంట్ జారీ

2012 డిసెంబర్ లో 23 ఏళ్ల వైద్యవిద్యార్థినిపై ఆరుగురు సామూహిక అత్యాచారం చేసి, ఆమెను చిత్రహింసలు పెట్టారు. దాంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ఈ కేసులో ఓ దోషి జైలులో ఆత్మహత్య చేసుకోగా, మరో దోషి మైనర్ కావడంతో శిక్ష అనుభవించి విడుదలయ్యాడు.

కోర్టు నలుగురికి ఉరిశిక్ష విధించింది. అయితే, ఉరిశిక్ష అమలులో జాప్యం చేయడానికి దోషులు న్యాయవ్యవస్థలోని వెసులుబాట్లను వాడుకుంటూ వస్తున్నారు. తొలి డెత్ వారంట్ ప్రకారం వారిని ఫిబ్రవరి 2వ తేదీన ఉరి తీయాల్సి ఉంది. అయితే, దోషులు మెర్సీ పిటిషన్లు, క్యూరేటివ్ పిటిషన్లు వేసుకుంటూ, ఇతరత్రా కోర్టులను ఆశ్రయిస్తూ జాప్యం చేస్తూ వస్తున్నారు.

Also Read: నిర్భయ కేసు: కేంద్రానికి హైకోర్టు షాక్, దోషులకు వారం గడువు

నలుగురు దోషులను ఒకేసారి మార్చి 3వ తేదీన ఉరి తీయాలని పాటియాల హౌస్ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈసారి నలుగురిని ఉరి తీస్తారని ఆశిస్తున్నట్లు ఆశాదేవి తెలిపారు.