ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. రోజురోజుకూ వీరి ఆరోగ్యపరిస్థితి ఇబ్బందిగా మారుతోంది. దీంతో వైద్యులు అక్కడే శిభిరాలు వేసుకుని వైద్యం అందిస్తున్నారు. 

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో కొద్దిరోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న రైతుల్లో 50 శాతం మంది అనారోగ్యం బారిన పడ్డారు. కొంతమంది దగ్గుతో బాధపడుతుండగా, మరికొందరు తలనొప్పి, జలుబుతో బాధపడుతున్నారు. 

అక్కడే శిబిరాలను ఏర్పాటు చేసిన వైద్యులు... రైతులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ రైతుల ఆందోళన మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 50 శాతం మంది రైతులు అనారోగ్యం బారిన పడ్డారు. ఇలాంటి వారిలో అధికంగా వృద్ధులు ఉన్నారు. 

తాము వందలమంది రైతులకు ప్రతిరోజూ చికిత్స చేస్తున్నామన్నారు. అలాగే వారికి ఆయుర్వేద ఔషధాలను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఇక్కడి చలివాతావరణం, కలుషితమైన నీరు, గాలి కారణంగా వారు అనారోగ్యం బారిన పడ్డారని వైద్యులు తెలిపారు.

కాగా  ఢిల్లీ శివారులోని టిక్రి సరిహద్దులో మంగళవారం ఉదయం హర్యానాకు చెందిన ఓ యువ రైతు గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. సోనెపట్‌కు చెందిన 32 ఏళ్ల అజయ్‌ మూర్‌ గత కొన్ని రోజులుగా ఆందోళనల్లో పాల్గొంటూ రహదారిపైనే పడుకుంటున్నారు. తీవ్రమైన చలి కారణంగానే ఆయన మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

కాగా.. గతవారం ఇదే టిక్రి సరిహద్దులో పంజాబ్‌కు చెందిన ఓ 57ఏళ్ల రైతు గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా గత 12 రోజులుగా రైతన్నలు ఢిల్లీ శివారుల్లో ఆందోళన సాగిస్తున్నారు. ట్రాక్టర్లనే గుడారాలుగా మలుచుకుని.. రోడ్డుపైనే వంట చేసుకుంటూ నిరసన తెలుపుతున్నారు.