మహారాష్ట్రలో జరిగిన ఘోర ప్రమాదంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత, వ్యాపారవేత్త సంజయ్ షిండే దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే... కాగా నాసిక్‌ జిల్లాకు చెందిన సంజయ్‌ షిండే ద్రాక్ష పళ్లను ఎగుమతి చేస్తూ వ్యాపారవేత్తగా ఎదిగారు.

ఎన్సీపీలో చేరి రాజకీయ నాయకుడిగా స్థానికంగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో సంజయ్‌ షిండే ఎరువులు కొనుగోలు చేసేందుకు మంగళవారం సాయంత్రం పింప్లాగావ్‌కు బయల్దేరారు.

ముంబై- ఆగ్రా హైవేలో కడ్వా నదిపై ఉన్న ఓవర్‌బ్రిడ్జి షార్ట్‌పై ప్రయాణిస్తుండగా షార్ట్ సర్య్యూట్‌ కారణంగా కారులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో సెంట్రల్‌ లాకింగ్‌ సిస్టమ్‌ యాక్టివేట్‌ అయిపోయి డోర్లన్నీ జామ్ అయిపోయాయి.

అద్దాలు బద్దలుకొట్టుకుని బయటకు వచ్చేందుకు సంజయ్‌ షిండే ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మార్గం లేక సాయం కోసం అర్థిస్తూ సంజయ్ సజీవ దహనమయ్యారు.

దీనిపై స్థానికులు స్పందిస్తూ మంటల్లో కాలిపోతున్న సమయంలో సాయం కోసం ఆయన కేకలు వేశారని, వెంటనే తాము అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చినట్లు తెలిపారు. మంటలార్పేందుకు తాము ప్రయత్నించామని, అయితే అప్పటికే సంజయ్ మరణించారని వెల్లడించారు.