ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన వ్యాపార కార్యకలాపాల్లో బిజిగా ఉంటూనే వీలు కుదిరినప్పుడల్లా దేశంలోని రాజకీయ, సామాజిక అంశాలపై సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు.

ఈ క్రమంలో తన తల్లిని వృద్ధాప్యంలో దేశంలోని తీర్థ స్థలాలను చూపించేందుకు కష్టపడుతున్న ఓ కొడుకుని చూసి పరవశించిపోయిన ఆనంద్.. అతనికి బహుమానం అందించాలని నిర్ణయించుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం మైసూరు నగరానికి చెందిన దక్షిణామూర్తి కృష్ణకుమార్ బ్యాంక్ ఉద్యోగి. తన తల్లి తనను పెంచడం కోసం ఇంట్లోనే తన జీవితాన్ని గడిపేసిందని.. తనను ప్రయోజకుడిని చేయడం కోసం అన్ని త్యాగం చేసిందని ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

Also Read: రూపాయికే ఇడ్లీ అందిస్తున్న బామ్మ... గ్యాస్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా

హంపిని చూడాలని తల్లి చెప్పడంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తన 20 ఏళ్ల నాటి బజాజ్ స్కూటర్‌పై దేశంలోని పలు తీర్థయాత్రలకు తీసుకెళ్లాడు. ఇప్పటి వరకు 48,100 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తన తల్లికి దేశంలోని ప్రముఖ ఆలయాలు, పర్యాటక స్థలాలను చూపించాడు.

ఇంకా వారి యాత్ర పూర్తవ్వల్లేదు. కన్నతల్లిపై కృష్ణకుమార్‌కున్న ప్రేమను చాటుతున్న వీడియోను నాంది ఫౌండేషన్ సీఈవో మనోజ్ కుమార్ ట్వీట్ చేశారు.

ఒంటరిగా ఉంటున్న తన తల్లికి తాను ఒక్కడినే కుమారుడినని.. ఆమె జీవితంలో చేసిన త్యాగాలకు గౌరవప్రదమైన జీవితం గడపాల్సిన అవసరం ఉందని తనకు అనిపించిందని కృష్ణకుమార్ ఈ వీడియోలో తెలిపాడు.

ఏడు నెలల్లో ఇప్పటి వరకు పలు రాష్ట్రాల్లో తమ యాత్ర సాగిందని వెల్లడించాడు. హోటల్ ఖర్చులను నివారించేందుకు గాను వారు మఠాలు, సత్రాల్లో బసచేసేవారని.. ఆహార పదార్థాలను ఆ స్కూటర్‌లోనే నిల్వ చేసుకునేవారని ఒరిస్సా పోస్ట్ ఓ కథనంలో తెలిపింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ఆనంద్ మహీంద్రా కంట పడింది. తల్లిపై కుమారుడు చూపించిన ప్రేమకు ఆయన ఫిదా అయ్యారు. తన వంతుగా మహీంద్రా కేయూవీ 100 ఎన్ఎక్స్‌టీ కారును బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆనంద్ ట్వీట్ చేశారు.

Also Read: చంద్రయాన్ గుండె చప్పుడు వింటున్నాం... ఆనంద్ మహీంద్రా ట్వీట్

తద్వారా తల్లీ కుమారుడి పర్యటనలు ఆ కారులో సాగేందుకు వీలవుతుందని ఆనంద్ తన దాతృత్వాన్ని చాటారు. ఆయనకు ఇలాంటివి కొత్తకాదు.. గతంలో ఒక్క రూపాయికే ఇడ్లీ అమ్ముతూ పేదల ఆకలి తీర్చుతున్న తమిళనాడుకు చెందిన కమలాత్తాళ్‌కు వంట గ్యాస్ కనెక్షన్ ఇప్పించడంతో పాటు ఆర్ధిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

అంతేకాదు ఓ ట్వీట్టర్ యూజర్‌కు ఇచ్చిన మాట ప్రకారం.. తన ఆఫీస్ బోర్డు మీటింగ్ గదుల్లో ప్లాస్టిక్ బాటిళ్లను తొలగించి వాటి స్థానంలో రాగి, స్టీల్‌ సీసాలను ఏర్పాటు చేశారు. నన్హీ కలీ పేరిట ఆనంద్ మహీంద్రా ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు.

దీని ద్వారా ఆర్ధికంగా వెనుకబడిన బాలికలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70 వేల మంది బాలికలు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. నాంది పేరిట గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా తాగునీరందించే కార్యక్రమాల్లోనూ ఆనంద్ మహీంద్రా పాలు పంచుకున్నారు.