బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ సారి ఎన్నికల్లో​ ఒంటరిగా పోటీ చేయాలని మా నాన్న భావించారని.. అలా అయితేనే పార్టీకి ఆదరణ, మనుగడ ఉంటుందని చిరాగ్ చెప్పారు.

ఎన్డీఏ నుంచి విడిపోయినా, బీజేపీతో పొత్తుకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. నితీశ్ ప్రభుత్వంపై పోరాడతామని.. ఒంటరిగా బరిలో దిగాలని నాన్న తనను ప్రేరేపించారని, ఇది ఆయన అతిపెద్ద కల అని చిరాగ్ గుర్తుచేశారు.

2005లోనే నాన్న ఈ నిర్ణయం తీసుకున్నారని.. దీనిపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, షహనావాజ్ హుస్సేన్ వంటి చాలా మంది బీజేపీ నాయకులకు తెలుసునని ఆయన చెప్పారు.

‘ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మరో ఐదేళ్లు కొనసాగితే మీరు మరో 10-15 ఏళ్లు చింతించాల్సి వస్తుందని నాన్న చెప్పారని చిరాగ్ పేర్కొన్నారు. నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా కొనసాగడం ప్రజల పాలిట పెను విపత్తు అవుతుందని నాన్న భావించారు.

అందుకే ఒంటరిగా పోటీ చేయాలని నన్ను ప్రేరేపించారు’ అన్నారు. తన తండ్రి మరణం తనను ఎంతో కుంగదీసిందని.. తాను ఆయనను బాగా మిస్ అవుతున్నానని, ఇలాంటి పరిస్ధితిని ఎవరూ ముందుగా ఊహించలేరని చిరాగ్ పాశ్వాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

నాన్న లేకపోయినా ఆయన ఆశయాలే తనకు బలమని.. ఆయన పాటించిన విలువను తాను కొనసాగిస్తానని చిరాగ్ చెప్పారు. అయితే ఈ నిర్ణయాన్ని బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. రామ్ విలాస్ పాశ్వాన్ బతికి వుంటే ఇలాంటి ఆలోచన చేసేవారు కాదని సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు.