బాగా డబ్బున్న ఓ వృద్ధుడికి ఓ మహిళ లైన్ వేసింది. అతనిని పెళ్లిచేసుకుంటానని నమ్మించింది. ఆ తర్వాత తెలివిగా అతని దగ్గర నుంచి రూ.కోటి తీసుకొని.. ఆ తర్వాత అక్కడి నుంచి వుడాయించింది. దీంతో.. మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మలద్ ప్రాంతంలో నివసించే 73ఏళ్ల జెరాన్ డిసౌజా 2010లో తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయించాడు. దాంతో వచ్చిన రూ.2కోట్లను ప్రైవేటు బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేశాడు. కాగా.. 2019లో ఫిక్స్ డ్ డిపాజిట్.. దానిపై వడ్డీ రూపంలో వచ్చిన భారీ మొత్తాన్ని ఉపసంహరించుకున్నాడు.

అయితే.. అదే బ్యాంకులో పనిచేస్తున్న ఓ మహిళ ఆ డబ్బులను కొట్టేయాలని ప్లాన్ వేసింది. పథకం ప్రకారం అతనితో పరిచయం పెంచుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. ఇద్దరూ కలిసి పలుమార్లు రెస్టారెంట్స్, రిస్టార్ట్స్ కి కూడా వెళ్లారు.

తనను పూర్తిగా నమ్మేశాడు అనుకున్న తర్వాత తన ప్లాన్ అమలు పరిచింది. తానొక వ్యాపారం చేస్తున్నానని..  అందులో పెట్టుబడి పెట్టాలని కోరింది. లాభాలు చెరిసగం తీసుకుందామని చెప్పింది. కాబోయే భార్యే కదా అని నమ్మి పెట్టుబడి కింద రూ.1.2కోట్లను గతేడాది డిసెంబర్ లో షాలిని కి ఇచ్చాడు.

డబ్బు తన ఖాతాలో పడగానే.. సదరు మహిళ తన ఫోన్ స్విచ్ఛాప్ చేసింది. ముసలాయనకు కనపడకుండా అక్కడి నుంచి చెక్కేసింది. ఆమె గురించి పలుమార్లు ఆరా తీసిన వృద్ధుడు.. మోసపోయానని అర్థమై పోలీసులను ఆశ్రయించాడు. ఆయన డిసెంబర్ లోనే ఫిర్యాదు చేయగా.. అది నిజమో కాదో గుర్తించి.. తాజాగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.