Goa Assembly election 2022: శివసేన భవిష్యత్తు కోసం కాదు.. అక్కడి స్థానికుల కోసం తాము గోవా ఎన్నికల బరిలో నిలుస్తున్నామని శివసేన నాయకుడు ఆదిత్యాథాక్రే అన్నారు. శనివారం నాడు ఆయన గోవా ఎన్నికల తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తూ.. పై వ్యాఖ్యలు చేశారు.
Goa Assembly election 2022: ఈ నెలలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ లో గురువారం తొలి దశ పోలింగ్ ప్రారంభం కాగా, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఇక గోవాలోనూ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుండటంతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలని అన్ని పార్టీలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సారి గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ సహా స్థానిక పార్టీలు గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన సైతం పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర మంత్రి, శివసేన నాయకుడు ఆదిత్య థాకరే రాబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం శివసేన డిజిటల్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో స్నేహం కారణంగా గోవాపై తమ పార్టీ ముందుగా దృష్టి సారించలేకపోయిందని థాకరే చెప్పారు. అయితే, బీజేపీ వెన్నుపోటు తర్వాత గోవాలో జరిగి అన్ని ఎన్నికల్లో పోటీ చేయాలని శివసేన నిర్ణయించుకుందని తెలిపారు. గోవాకు శివసేన అవసరమని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ సుస్థిర అభివృద్ధిని తీసుకురావడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు.
2019 మహారాష్ట్ర ఎన్నికల తర్వాత శివసేన బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. రాష్ట్రంలో మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), కాంగ్రెస్‌తో జతకట్టింది. ఇక ఫిబ్రవరి 14న జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీతో పొత్తు పెట్టుకుని శివసేన పోటీ చేస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఈసారి గోవాలో 10 మంది అభ్యర్థులను నిలబెట్టింది. గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ నియోజక వర్గం నుండి బీజేపీ టిక్కెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో పనాజీ స్థానం నుండి పార్టీ తన అభ్యర్థి శైలేంద్ర వెలింగ్‌కర్‌ను ఉపసంహరించుకుంది.
"బీజేపీతో దోస్తీ కారణంగా శివసేన గతంలో గోవాపై దృష్టి పెట్టలేదు. కానీ రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే, బీజేపీ సేనను వెన్నుపోటు పొడిచింది, మేము భవిష్యత్తులో అన్ని ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాము. గోవా పంచాయతీ, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మేం ఇక్కడి నుంచే పోటీ చేస్తాం.. గోవాకు శివసేన అవసరం" అని ఆదిత్యా థాక్రే అన్నారు. గోవాలో పార్టీ ప్రచారానికి మంచి స్పందన వస్తోందని తెలిపారు. "ఈ ఎన్నికలు శివసేన భవిష్యత్తు గురించి కాదు, స్థానికులు, అక్కడి వారి భవిష్యత్తు గురించి" అని పేర్కొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ గోవాలో ఎలాంటి స్థిరమైన అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు.
నీరు, కరెంటు సరఫరా వంటి సమస్యలు ఇప్పటికీ ప్రజలు ఎదుర్కొంటున్నారనీ, ఇది ఇలా ఉంటే, రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా నాయకులు అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారని ఆయన అన్నారు. సమాజంలో విభజనను సృష్టించడం, ద్వేషాన్ని వ్యాప్తి చేయడం, దాని నాయకులు అసంబద్ధమైన విషయాల గురించి మాట్లాడుతున్నారని, దీని కారణంగా నిజమైన సమస్యలు అవసరమైన దృష్టిని పొందడంలో విఫలమయ్యాయని థాకరే బీజేపీ పై విమర్శలు గుప్పించారు.
