ముంబయిలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. నగర శివారు అంధేరి మరోల్‌లోని ఈఎస్‌ఐ కామ్‌గార్‌ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.  ఈ ఘటనలో నిన్న ఆరుగురు మృతిచెందగా.. మంగళవారం తెల్లవారుజామున మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదు నెలల చిన్నారి కూడా ఉంది.

ఆసుపత్రిలోని నాలుగో అంతస్తులో చెలరేగిన మంటలు ఇతర అంతస్తులకూ వ్యాపించాయి. ప్రమాదం గురించి తెలియగానే వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. 10 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అగ్నిప్రమాదం కారణంగా భవనమంతా దట్టమైన పొగ కమ్ముకుని రోగులు, ఆసుపత్రి సిబ్బంది చిక్కుకుపోయారు. ఇప్పటివరకు 176 మందిని రక్షించి చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి తరలించారు.

వీరిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య  ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలను  అధికారులు పరిశీలిస్తున్నారు.