భువనేశ్వర్: కట్టుకున్న భర్తను బ్రతికించుకోడానికి ఏకంగా కన్న కొడుకునే తాకట్టుపెట్టింది ఓ మహిళ. కడుపు తీపి కంటే తాళికట్టిన భర్త ప్రాణనికే ప్రాధాన్యతనిచ్చిన మహిళ మరో మహిళ వద్ద కొడుకును తాకట్టు పెట్టింది. ఇలా ఆ తల్లి ఆర్థిక అవసరాలు ఐదునెలల పసిగుడ్డును తాకట్టు పెట్టేలా చేశాయి. 

ఈ దయనీయ ఉదంతానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాలోని గంజాం జిల్లా భంజ్‌నగర్‌కు చెందిన దుఖా నాయక్‌ మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు ఇప్పటికీ చికిత్స పొందుతున్నాడు. దీంతో వైద్య ఖర్చుల కోసం అతడి భార్య జిలీ నాయక్‌ తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కుంటోంది. 

అయితే ఇటీవల అతడి ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనకు ఎలాగైనా మెరుగైన వైద్యం అందించాలని నిర్ణయించుకున్న జిలీ ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. చికిత్స ఖర్చుల కోసం తన ఐదు నెలల కుమారుడిని సొంత అక్క వద్ద రూ.10 వేలకు తాకట్టు పెట్టింది. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.