కొడుకు స్నేహితుడంటే తనకు బిడ్డ లాంటి వాడనే సంగతి మరచిపోయిన ఓ తల్లి అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అక్కడితో ఆగకుండా తమ బంధానికి అడ్డుగా ఉన్నాడనే కోపంతో కన్న బిడ్డనే హత్య చేసింది.

వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని జజ్జర్ జిల్లాకు చెందిన మీనా అనే మహిళ కొడుకు ప్రమోద్‌తో కలిసి గురుగ్రామ్‌లో నివసిస్తోంది. బౌన్సర్‌గా పనిచేసే ప్రమోద్‌ దగ్గరికి అప్పుడప్పుడు అతని మిత్రుడు ప్రదీప్ వచ్చేవాడు.

ఈ క్రమంలో ప్రమోద్ తల్లితో అతనికి పరిచయం ఏర్పడి, అది అక్రమ సంబంధానికి దారి తీసింది. దీనిని కొద్దిరోజుల్లోనే గుర్తించిన ప్రమోద్.... విధులకు వెళ్లడం మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు.

అంతేకాకుండా ప్రదీప్‌ను సైతం తన ఇంటికి రావొద్దని వారించాడు. ప్రియుడిని కలవలేకపోవడంతో మీనాకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడన్న అక్కసుతో కొడుకును చంపాలని కుట్ర పన్నింది.

ఫిబ్రవరి 19న ప్రియుడితో పాటు అతని ఇద్దరి మిత్రుల సాయంతో ప్రమోద్‌ను తన ఇంట్లోనే హత్య చేసింది. ఆ తర్వాతి రోజు ఏం తెలియనట్లు తన కొడుకు హత్యకు గురయ్యాడంటూ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న సౌరభ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తల్లి మీనా, ఆమె ప్రియుడు ప్రదీప్‌తో పాటు అతని ఇద్దరు మిత్రులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.