కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలను ఓ తల్లి కిరాతకంగా హత్య చేసింది. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడు రాష్ట్రం కళ్లకురిచ్చి సమీపం కీళ త్తూర్‌దిగుళి గ్రామానికి చెందిన ఈశ్వరన్‌ (30), రేవతి (27) దంపతులకు పుష్పలత (4), యమున (2) అనే ఇద్దరు కుమార్తెలున్నారు. ప్రస్తుతం రేవతి మళ్లీ గర్భంతో ఉంది. రెండు రోజుల కిత్రం భార్యాభర్తల మధ్య గొడవలు చెలరేగాయి. ఆ సమయంలో ఆగ్రహించిన ఈశ్వరన్‌ రేవతిపై చేయిచేసుకున్నాడు. 

దీంతో మనస్తాపానికి గురైన రేవతి ఇద్దరు పిల్లలను తీసుకొని బయటకు వెళ్లిపోయింది. రాత్రి ఆమె ఇంటికి రాకపోవడంతో ఈశ్వరన్‌, బంధువుల సాయంతో చట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో, ఆ ప్రాంతంలోని బావి సమీపంలో రేవతి చెప్పు కనిపించింది. దీంతో కారియలూరు పోలీసులు అక్కడకు చేరుకొని బావిలో గాలింపు చేపట్టడంతో రేవతి, పుష్పలత, యమున మృతదేహాలు బయటపడ్డాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కళ్లకురిచ్చి ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు, ఘటనపై కేసు నమోదుచేసి ఈశ్వరన్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.