మణిపూర్ లో హింస చెలరేగడంతో ప్రాణభయంతో మయన్మార్ కు వెళ్లి, అక్కడ సాగింగ్ డివిజన్ లోని తము ప్రాంతంలో తలదాచుకున్న మెయిటీలు ఎట్టకేలకు భారత్ కు తిరిగి వచ్చారు. వారికి భద్రత బలగాలు స్వాగతం పలికాయి.

మణిపూర్ లో కొనసాగుతున్న జాతి కలహాల నేపథ్యంలో గత మూడు నెలలుగా మయన్మార్ లో ఆశ్రయం పొందిన 200 మందికి పైగా భారతీయులను శుక్రవారం భారత్ కు తిరిగి వచ్చారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య వారు స్వరాష్ట్రంలోకి అడుగుపెట్టారు. వారికి భద్రతా దళాలు స్వాగతం పలికాయి. దీంతో మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ ఇండియన్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపారు.

మణిపూర్ లో చెలరేగిన హింసాత్మక ఘటనలో నేపథ్యంలో మే 3వ తేదీన మోరే వార్డు నంబర్ 4 ప్రేమ్ నగర్ కు చెందిన పలువురు ఇండో-మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దు దాటి మయన్మార్ కు పారిపోయారు. అక్కడి సాగింగ్ డివిజన్ లోని తము ప్రాంతంలో ఆశ్రయం పొందారు. అప్పటి నుంచి ఆ దేశంలోనే ఉంటున్నారు. దీంతో వారిని స్వదేశానికి తీసుకురావడానికి మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రయత్నించింది. 

Scroll to load tweet…

చివరికి సుమారు 212 మంది పౌరులను (అందరూ మెయిటీలు) శుక్రవారం మధ్యాహ్నం ఇంఫాల్ కు దక్షిణాన 110 కిలోమీటర్ల దూరంలోని సరిహద్దు వాణిజ్య పట్టణం మోరెకు తీసుకువచ్చారు. అస్సాం రైఫిల్స్, గూర్ఖా రైఫిల్స్ కమాండెంట్ల నేతృత్వంలోని భారత ఆర్మీ బృందాలు సరిహద్దు గేట్ల వద్ద వారికి స్వాగతం పలికాయి.

Scroll to load tweet…

దీంతో సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతూ మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం ట్విట్టర్ ఓ పోస్టు పెట్టారు. ‘‘మణిపూర్ లోని మోరే పట్టణంలో మే 3 అశాంతి తరువాత మయన్మార్ సరిహద్దు వెంబడి భద్రత కోరిన 212 మంది తోటి భారతీయ పౌరులు (అందరూ మీటీలు) ఇప్పుడు సురక్షితంగా భారత గడ్డపైకి తిరిగి వచ్చారు. వారిని స్వదేశానికి తీసుకురావడంలో భారత సైన్యం చూపిన అంకితభావానికి అభినందనలు. జీఓసీ ఈస్టర్న్ కమాండ్, లెఫ్టినెంట్ జనరల్ ఆర్పీ కలితా, జీఓసీ 3 కార్ప్, లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఎస్ సాహి, 5 ఏఆర్ సీవో కల్నల్ రాహుల్ జైన్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.

కాగా.. మణిపూర్ లో మే మొదటి వారంలో కుకి, మెయిటీ కమ్యూనిటీల మధ్య జాతి హింస చెలరేగింది, దీనిలో సుమారు 150 మంది మరణించారు. దాదాపు 50,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అనేక గ్రామాలు, ప్రాంతాలను తగలబెట్టారు.