స్క్రాప్ విక్రయంతో రూ. 1,163 కోట్ల ఆదాయం: రెండు చంద్రయాన్-3ల బడ్జెట్ కు సమానం
స్క్రాప్ విక్రయంతో నరేంద్ర మోడీ సర్కార్ రూ. 1,163 కోట్లను సంపాదించింది. చంద్రయాన్ -3 వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేవలం రూ. 600 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది కేంద్రం.
న్యూఢిల్లీ: చంద్రయాన్ -3 మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 600 కోట్లు ఖర్చు పెట్టింది. చంద్రయాన్-3 తరహా వంటి కార్యక్రమాలకు స్క్రాప్ విక్రయాల ద్వారా తగినంత డబ్బును సమకూర్చుకోవచ్చు.
స్క్రాప్, పాత ఫైళ్లు, పాత ఇనుము, కార్యాలయాల్లో వాడుకలో లేని వాహనాలు విక్రయించడం ద్వారా చంద్రయాన్ కు చెందిన రెండు మిషన్ లకు నిధులను సమకూర్చారు.
2021 నుండి స్క్రాప్ విక్రయం ద్వారా మోడీ ప్రభుత్వం రూ. 1,163 కోట్లను సంపాదించింది. ఈ ఏడాది అక్టోబర్ మాసంలో రూ.557 విలువైన స్క్రాప్ విక్రయించారు.
2021 అక్టోబర్ నుండి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 96 లక్షల ఫైళ్లు తొలగించారు. అంతేకాదు ప్రభుత్వ కార్యాలయల్లో 355 లక్షల చదరపు అడుగుల స్థలం ఖాళీ చేసినట్టుగా ప్రభుత్వ నివేదికలు తెలుపుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోని కారిడార్ లను శుభ్రపర్చడానికి , ఖాళీ స్థలాన్ని వినోద ఇతర ఉపయోగకరమైన ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారు.
చంద్రయాన్-3 సమయంలోనే రష్యా కూడ చంద్రుడిపై ప్రయోగాలను ప్రారంభించింది. రష్యా ప్రారంభించిన మూన్ మిషన్ విఫలమైంది. రష్యా మూన్ మిషన్ కు రూ.16,000 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే భారత దేశం మాత్రం కేవలం రూ.600 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
అంతరిక్ష యాత్రల కంటే హాలీవుడ్ సినిమాల నిర్మాణానికే ఎక్కువగా ఖర్చు అవుతుందని కేంద్ర అంతరిక్ష సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ ఏడాది ఆరంభంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది ప్రభుత్వానికి వచ్చిన రూ. 556 కోట్ల ఆదాయం లో రూ. 225 కోట్లు రైల్వే శాఖ నుండే వచ్చాయి. రక్షణ మంత్రిత్వ శాఖ నుండి రూ. 168 కోట్లు, పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ నుండి రూ. 56 కోట్లు, బొగ్గు మంత్రిత్వ శాఖ నుండి రూ. 34 కోట్లు వచ్చాయి.
ఈ ఏడాది దాదాపు 24 లక్షల ఫైళ్లు తొలగించారు. అత్యధికంగా విదేశాంగ మంత్రిత్వశాఖ 3.9 లక్షల ఫైళ్లను తొలగించారు. రక్షణ శాఖలో 3.15 లక్షల ఫైళ్లు తొలగించారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఫైల్స్ స్వీకరణ 96 శాతం పెరిగింది.
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛతను పెంపొందించడం కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.