Asianet News TeluguAsianet News Telugu

MLC Kavitha: 'అభినవ చాణక్యుడు సీఎం కేసీఆర్'

MLC Kavitha: భారతదేశానికి తెలంగాణ మోడల్ గా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అత్యంత వేగంగా అతి తక్కువ సమయంలో సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి సాధించిందని వివరించారు. 

MLC Kavitha says Telangana model not about statistics, but about improving lives of people KRJ
Author
First Published Oct 31, 2023, 12:01 PM IST | Last Updated Oct 31, 2023, 12:06 PM IST

MLC Kavitha: తెలంగాణ భారతదేశానికే దిక్చూచిగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, రాష్ట్ర ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయని అన్నారు. భారతదేశ సమగ్ర, స్థిరమైన అభివృద్ధికి తెలంగాణ బ్లూప్రింట్‌ గా మారిందని అన్నారు. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో సోమవారం జరిగిన ‘ఇన్‌క్లూజివ్‌ డెవలప్‌మెంట్‌: తెలంగాణ మోడల్‌’ అనే అంశంపై కవిత కీలకోపన్యాసం చేస్తూ .. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ అభివృద్ధి నమూనా అని పేర్కొన్నారు.

చంద్రశేఖర్‌రావు మానవతా దృక్పథంతో పాలన సాగించడం వల్ల తెలంగాణ వేగవంతమైన, సమగ్రమైన అభివృద్ధిని సాధించిందని అన్నారు. సీఎం కేసీఆర్ అభినవ చాణక్యుడని అభివర్ణించారు. బీఆర్ఎస్ పాలనలో బంజరు భూములు పచ్చని పంటపొలాలుగా తీర్చిదిద్ది దేశానికి సీఎం కేసీఆర్ స్ఫూర్తినిచ్చారన్నారు. అలాగే తెలంగాణ శాంతి, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని కవిత ఉద్ఘాటించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తరచూ మత ఘర్షణలను జరిగేవని అన్నారు.

సీఎం కేసీఆర్ హయాంలో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినప్పటి నుండి ఒక్క మతపరమైన అల్లర్లను జరగలేదని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య పాటిస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బహుళ రంగాలలో అగ్రగామిగా ఉందని అన్నారు. అలాగే..  ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకోవడంలోనూ తెలంగాణ ముందు వరుసలో నిలిచిందని అన్నారు.  తెలంగాణ మోడల్ అంటే ఆర్థికంగా కాదని, తెలంగాణ ప్రజల జీవన స్థితిగతులు కూడా పూర్తిగా మారాయని స్పష్టం చేశారు. 

ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సాధించడం సుదీర్ఘ పోరాటమని, దాదాపు 14 ఏళ్ల పాటు సీఎం కేసీఆర్ పోరాటానికి నాయకత్వం వహించారని అన్నారు. తెలంగాణ.. సమైక్య రాష్ట్రంలో భాగమైనప్పుడు ఈ ప్రాంతంలోని పది జిల్లాల్లో తొమ్మిది జిల్లాలు వెనుకబడినవిగా పరిగణించేవారని ఆమె గుర్తు చేశారు. ఆ సమయంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ ప్రాంతం రెండవ స్థానంలో ఉండేదనీ,  ఉద్యమం సమయంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉండేదని గుర్తు చేశారు. అలాగే.. నీటి కొరత కూడా ఉండేదని అన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర పరివర్తన అసాధారణమైనది కాదు. మిగులు విద్యుత్, వ్యవసాయ వృద్ధి, ధాన్యం ఉత్పత్తి పెరుగుదల ఇవన్నీ తెలంగాణ సుభిక్షం వైపు పయనించడానికి గుర్తుగా నిలిచాయని అన్నారు. 

ఇంకా 2014-15 నుంచి 2022-23 మధ్యకాలంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 118.2 శాతం పెరిగిందని, అందులో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జిఎస్‌డిపి) 155.7 శాతం వృద్ధిని సాధించిందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ప్రస్తుతం జీఎస్‌డీపీలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని అన్నారు. తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని, రాష్ట్రం ఏర్పడే సమయంలో రూ.1,12,162 ఉండగా.. 2022-23 నాటికి రూ. 3,14,732కి పెరిగిందని పేర్కొన్నారు.

సమాన ఆదాయ పంపిణీపై తెలంగాణ విధాన దృష్టి, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ 2019-21 ప్రకారం సమాన ఆదాయ పంపిణీలో అగ్రస్థానంలో ఉందని, ఇది సీఎం కేసీఆర్ దూరదృష్టి, నాయకత్వానికి నిదర్శనమని అన్నారు. 2014లో ప్రతికూల వృద్ధి నుండి 2022-23 నాటికి చెప్పుకోదగిన 15.7 శాతం వృద్ధిని సాధించింది. రైతు బంధు పెట్టుబడి మద్దతు పథకం, రైతులకు ఉచిత సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి కీలక సంస్కరణలు రాష్ట్ర వ్యవసాయ రంగంలో  గణనీయమైన మార్పులు వచ్చాయని అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios