ముంబై: ఓ టీబీ బాధితుడు 14 రోజుల కిందట అదృశ్యమై టాయిలెట్లో శవంగా కనిపించాడు. ఈ సంఘటన ముంబైలోని శివాడీలో గల టీబీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. సమాచారం చేరిన వెంటనే పోలీసులు, బీఎంసీ అధికారులు ఆస్పత్రికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. 

27 ఏళ్ల సూర్యాబన్ యాదవ్ అనే వ్యక్తి టీబీ వ్యాధితో ఇటీవల ఆస్పత్రిలో చేరాడు. అతనికి కరోనా లక్షణాలు కూడా ఉన్నట్లు తేలింది. అయితే, అతను కొద్ది రోజుల క్రితం ఆస్పత్రి నుంచి అదృశ్యమయ్యాడు. 

ఎంత గాలించినా దొరకకపోవడంతో ఆస్పత్రి సిబంబ్ది ఈ నెల 4వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా అదృశ్యమైన 14 రోజుల తర్వాత అతని శవం బయటపడింది. 

టాయ్ లెట్ నుంచి దుర్వాసన వస్తుండడంతో ఆస్పత్రిలో పని చేసే వార్డుబాయ్ తలుపులు పగులగొట్టి చూశాడు. అక్కడ సూర్యాబన్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. అతనిది సహజ మరణమే అయి ఉంటుందని, శ్వాస తీసుకోవడంలో ఏర్పడిన ఇబ్బంది వల్ల మరణించి ఉంటాడని ఆస్పత్రి వర్గాలు భావిస్తున్నాయి.