తమిళ నాడులోని పుదుచ్చెరి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగం నిమిత్తం ఒంటరిగా నివసిస్తున్న ఓ యువతిపై 15 ఏళ్ల మైనర్ బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. యువతి అద్దెకుంటున్న ఇంటి పక్కనే నివసించే బాలుడు ఆమెను ఎలాగైనా లోబర్చుకోవాలని భావించాడు. దీంతో అదును చూసుకుని యువతిని తీవ్రంగా చితకబాది స్పృహ కోల్పోయాక అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భయపడి యువతిని దారుణంగా హతమార్చాడు.  

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పుదుచ్చెరి కుయవర్‌పాళయంలో ఓ ప్రైవేట్ బ్యాంకులో 25 ఏళ్ళ యువతి పనిచేస్తోంది.  కుటుంబానికి దూరంగా అక్కడే ఓ గదిని అద్దెకు తీసుకుని ఒంటరిగా నివాసముంటోంది. 

యువతి ఒంటరితనాన్ని గుర్తించిన ఇంటిపక్కనుండే ఓ 15 ఏళ్ల బాలుడు యువతిపై కన్నేశాడు. ఆమె ఇంట్లో వున్న సమయంలో దౌర్జన్యంగా ఆమెపై దాడికి తెగబడ్డాడు. యువతిని తీవ్రంగా చితకబాదడంతో స్పృహ కోల్పోయింది. ఇలా అపస్మారక స్థితిలో వున్న యువతిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎక్కడ యువతి ఈ విషయాన్ని  బయటపెడుతుందోనని గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత తనకేమీ తెలియనట్లుగా ఉండిపోయాడు. 

అయితే యువతి అత్యాచారం, హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా హత్యకు గురైన యువతి అద్దెకుంటున్న ఇంటి చుట్టుపక్కల వారిని విచారించారు. ఈ సమయంలో సదరు యువకుడిని విచారించగా అనుమానాస్పదంగా వ్యవహరించాడు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా జరిగిన దారుణం గురించి వివరించాడు.