ఓ మైనర్ బాలుడి పై నాలుగు సంవత్సరాలుగా మరో బాలుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన  ఉత్తర్ ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నొయిడా పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నోయిడాలోని  పక్కపక్క ఇళ్లల్లో ఉండే రెండు కుటుంబాలకు చెందిన 12 ఏళ్లు, 16 ఏళ్ల బాలురు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. ఒకే బస్‌లో స్కూలు వెళ్లొస్తారు. ఈక్రమంలోనే 12 ఏళ్ల బాలునికి మాయమాటలు చెప్పిన నిందితుడు (16 ఏళ్ల బాలుడు) లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధితుడు తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురయ్యాడు. 


ఈక్రమంలోనే చైల్డ్‌ లైఫ్‌ నెంబర్‌ 1098 కి ఫోన్‌ చేసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. చైల్డ్‌ లైఫ్‌ ప్రతినిధులు విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితునిపై పోక్సో చట్టం, ఐపీసీ 377 సెక్షన్‌ (అసహజ నేరాలు) కింద కేసులు నమోదు చేశామని ఎస్‌హెచ్‌ఓ సుజీత్‌ ఉపాధ్యాయ తెలిపారు. కాగా, 2018లోనే ఓసారి నిందితుని అకృత్యాలు బయటపడినట్టు తెలిసింది. బాధిత బాలుని తల్లిదండ్రులు నిందితుని కుటుంబ సభ్యులను హెచ్చరించడంతో వారు అక్కడ నుంచి ఇళ్లు ఖాళీ చేసి మరోచోటుకు వెళ్లిపోయారు. తాజాగా మరోసారి అలాంటి ఘటనే పునరావృతం కావడంతో పోలీసులను ఆశ్రయించారు.