Asianet News TeluguAsianet News Telugu

ఆ విషయంలో మోడీకి మద్దతిచ్చి తప్పు చేశాం: కేటీఆర్ సంచలనం

పెద్ద నగదు నోట్ల రద్దు విషయంలో మోడీకి మద్దతిచ్చి తప్పు చేశామని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యల చేశారు. గురువారం నాడు కేటీఆర్ టై్మ్స్ నౌ సదస్సులో పాల్గొన్నారు. 

minister KTR sesational comments on demonetization
Author
New Delhi, First Published Feb 13, 2020, 5:07 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: పెద్ద నగదు నోట్ల రద్దుతో ప్రజలకు మంచి జరుగుతోందని భావించి తమ పార్టీ మద్దతు ఇచ్చినట్టుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అయితే పెద్ద నగదు నోట్ల రద్దుతో లాభం కంటే నష్టమే ఎక్కువని తేలిందని ఆయన గుర్తు చేశారు.

గురువారం నాడు టైమ్స్ నౌ  ఆధ్వర్యంలో దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర అనే అంశంపై జరిగిన చర్చా గోష్టిలో పాల్గొన్న మంత్రి కేటీఆర్  పాల్గొన్నారు. పలు అంశాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలను అంశాల వారీగా తమ పార్టీ మద్దతు ఇచ్చినట్టుగా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

ప్రజా వ్యతిరేకమైన అసంబద్ధమైన చర్యలను అదేవిధంగా వ్యతిరేకించినట్టుగా ఆయన చెప్పారు.  పెద్ద నగదు నోట్ల రద్దు విషయంలో  మద్దతిచ్చి తప్పు చేశామని  ఆయన అభిప్రాయపడ్డారు. 

దేశంలో ఉన్న పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలేనని కేటీఆర్ సెటైర్లు వేశారు. దేశ వ్యాప్తంగా ఉనికి, యంత్రాంగం ఉన్న జాతీయ పార్టీలు ఏవీ కూడ లేవన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు కూడ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలేనని ఆయన సెటైర్లు వేశారు. 

భారతదేశం రాష్ట్రాల సమాఖ్య మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. బలమైన రాష్ట్రాలు ఉన్నప్పుడే బలమైన దేశం సాధ్యమవుతుందని కేటీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎన్ని ఉన్నా వాటి ఆచరణ అంతా కూడా రాష్ట్రాల్లోనే  ఉందన్నారు.

మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాల్లోనూ రాష్ట్రాల అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల సహకారం వంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణలో కీలకంగా ఉంటాయని కేటీఆర్ చెప్పారు.

 రాష్ట్ర ప్రభుత్వాలకు తన సొంత నిధులు  ఇస్తున్నామని కేంద్రం ఆలోచన మంచిది కాదని కేటీఆర్ కేంద్రానికి హితవు పలికారు. రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తున్న విషయాన్ని మరువకూడదన్నారు

 తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల 72 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నుల రూపంలో ఇస్తే తిరిగి రాష్ట్రానికి కేంద్రం నుండి  లక్షా 12 వేల కోట్లు  మాత్రమే ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు కేంద్రానికి చెల్లిస్తున్న పన్నులతో పోల్చుకుంటే కేంద్రం అన్ని నిధులను రాష్ట్రానికి తిరిగి ఇవ్వలేని విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

బిజెపి, కాంగ్రెస్ పార్టీలను తాము శత్రువులుగా భావించడం లేదన్నారు. కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే భావించి ఎన్నికల్లో పోరాటం చేస్తామన్నారు. అలాంటి పార్టీలతో వ్యక్తిగత శతృత్వం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

కేవలం తమ వాదన లేదా ఐడియాలజీ కి వ్యతిరేకంగా నిలిచి ఉన్నంత మాత్రాన... కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రాలను, లేదా ఇతర పార్టీలను శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదన్నారు. 

బీజేపీ కాంగ్రెస్లు పరస్పరం తమ పార్టీని ఆయా పార్టీలకు టీంలుగా విమర్శిస్తున్నాయి,  కానీ మేము తెలంగాణ ప్రజల పార్టీని అనే విషయాన్ని చెప్తున్నామన్నారు.గత కొంత కాలంగా జరుగుతూ వస్తున్న ప్రతి ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీలే బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ వస్తున్నాయి... రానున్న భవిష్యత్తులో కచ్చితంగా ప్రత్యామ్నాయ కూటమికి అవకాశాలు ఏర్పడుతున్నాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 

రెండు జాతీయ పార్టీలు దేశాన్ని ఇప్పటికే నిరాశ పరిచాయన్నారు. . ఆర్థిక అభివృద్ధి, మౌలిక వసతుల సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాల్లో దేశ ప్రజల ఆకాంక్షలను అందుకోలేక పోయాయని చెప్పారు.

సిటిజన్ అమెండ్మెంట్ బిల్లును పార్లమెంట్లో తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి వివాదాస్పద చట్టాల కన్నా దృష్టి పెట్టాల్సిన అతి ప్రాధాన్యత కలిగిన  ఇతర అంశాలు ఉన్నాయని  తమ పార్టీ అభిప్రాయమన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని కేటీఆర్ చెప్పారు. 

హైదరాబాద్ నగరాన్ని జీవించడానికి అవకాశం ఉన్న అత్యుత్తమ నగరాల్లో  మెర్స ర్  గత ఐదు సంవత్సరాలుగా  అగ్ర స్థానం కల్పిస్తూ వస్తుందని కేటీఆర్ గుర్తు చేశారు.భారతదేశాన్ని రెండవ జాతీయ రాజధానిగా ప్రకటించాల్సి వస్తే హైదరాబాద్ ప్రజలు అంగీకరిస్తారో లేదో అనే విషయంలో తనకు అనుమానం ఉందన్నారు.

నీతి అయోగ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా సహకరించాలని అనేక సూచనలు చేసినా ఇప్పటి దాకా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాలేశ్వరం ప్రాజెక్టు వంటి వాటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేటీఆర్ చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు,ఎఫ్ఆర్బీఎం పరిమితులు వంటి అంశాల్లో మరింత లిబరల్ గా ఉండాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios