చెన్నై:వచ్చే ఏడాది తమిళనాడు రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో  సినీ నటుడు కమల్ హాసన్ ఏర్పాటు చేసిన మక్కల్ నీది మయ్యంతో ఎంఐఎం జతకట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

సోమవారం నాడు ఎంఐఎం చీఫ్  తమిళనాడులో పార్టీ నేతలతో సమావేశమయ్యారని సమాచారం.  తమిళనాడులోని ఏఏ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే దానిపై  చర్చించారని తెలుస్తోంది.

తమిళనాడులోని వెల్లూరు, రాణీపేట్, తిరుపత్తూరు, క్రిష్ణగిరి, రామనాథపురం, పుదుకొట్టై, ట్రిచి, మధురై, తిరునల్వేలి జిల్లాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకొంటున్నట్టుగా ప్రచారం సాగుతోంది. తమిళనాడు నేతలతో మరోసారి ఈ విషయమై చర్చించాలని నిర్ణయం తీసుకొన్నారు.

ముస్లింల కోసం గళం విన్పిస్తున్న పార్టీలతో పాటు కమల్ పార్టీతో పొత్తు పెట్టుకొంటే విజయావకాశాలు ఎలా ఉంటాయనే విషయమై ఓవైసీ యోచిస్తున్నారని  సమాచారం. తమిళనాడులోనీ డీఎంకె జనరల్ సెక్రటరీ దురైమురుగన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ఎంఐఎం తమిళనాడు అధ్యక్షుడు షకీల్ అహ్మద్ ప్రకటించిన విషయం తెలిసిందే.

డీఎంకే నుండి స్పందన రాలేదన్నారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే కమల్ హాసన్ తో ఓవైసీ జట్టుకట్టే అవకాశం ఉందనే ప్రచారం తమిళ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

బెంగాల్ రాష్ట్రంలో పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటించింది. బెంగాల్  నేతలతో చర్చలు ఫలవంతమయ్యాయని అసద్ ట్వీట్ చేశారు.