జమ్మూలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఓ ఆర్మీ సైనికుడు చనిపోయారు. మరో నలుగురు సిబ్బందికి గాయాలు అయ్యాయి. ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూలో పర్యటించనున్నారు. ఈ సమయంలో అక్కడ ఉగ్రవాదుల ఉనికి వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు రెండు రోజుల ముందు జమ్మూలోని ఆర్మీ స్థావరం సమీపంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక భద్రతా అధికారి మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. జమ్మూ నగరంలోని సుంజ్వాన్ కంటోన్మెంట్ ప్రాంతంలో భద్రతా బలగాలు ముందస్తు ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఎన్‌కౌంటర్ మొద‌లైంద‌ని పోలీసులు తెలిపారు. నగరంలో ఉగ్రవాదులు దాడికి ప్లాన్ చేసినట్లు తమకు సమాచారం ఉందని చెప్పారు. 

వ‌చ్చే ఆదివారం నాడు ప్రధాని న‌రేంద్ర మోదీ జమ్మూకు రానున్నారు. 2019 ఆగస్టులో జ‌మ్మూ కాశ్మీర్ కు ప్ర‌త్యేక హోదాను రద్దు చేసిన తర్వాత అక్క‌డ ప్ర‌ధాని మోద‌టి సారిగా ప‌ర్య‌టించ‌నున్నారు. అయితే ఈ కార్య‌క్ర‌మానికి ముందు నగరంలోని కీలకమైన సైనిక స్థావరం సమీపంలో ఉగ్రవాదుల ఉనికిని గుర్తించ‌డం భ‌ద్ర‌తా ప‌రంగా ప్ర‌ధాన‌మైన స‌మ‌స్య‌గా ఏర్ప‌డింది. 

జ‌మ్మూలోని పల్లి అనే గ్రామంలో వేలాది మంది పంచాయతీ సభ్యులు పాల్గొనే భారీ ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని ప్ర‌సంగిస్తారు. ఈ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో జమ్మూ కాశ్మీర్ లో భ‌ద్ర‌తా ద‌ళాలు అలెర్ట్ అయ్యాయి. ఈ ప్రాంతంలో ఎలాంటి ఉగ్ర‌దాడి నిర్వ‌హించ‌కుండా భద్రతా దళాలు 24 గంట‌ల పాటు గ‌స్తీ నిర్వ‌హిస్తున్నాయి. అత్యంత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే ఈ క్ర‌మంలోనే సుంజ్వాన్ వద్ద దాదాపు ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్క‌డికి వెళ్లి ఆపరేషన్ ప్రారంభించడంతో అటు నుంచి భారీ కాల్పులు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ తొలి కాల్పుల్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. ఇంకా అక్క‌డ భీకర ఎన్‌కౌంటర్ జరుగుతోంది.

ఈ ఘ‌ట‌నపై జమ్మూ అదనపు డైరెక్టర్ జనరల్ ముఖేష్ సింగ్ మాట్లాడుతూ ‘‘ ఉగ్రవాదులు అక్కడ దాక్కున్నారని, కొన్ని దాడుల‌కు ప్లాన్ చేస్తున్నారనే స‌మాచారం అందింది. దీంతో మేము రాత్రి సమయంలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాము. అయితే ఉదయం సమయంలో కాల్పులు జరిగాయి, ఇందులో ఒక భద్రతా దళాల సిబ్బంది చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు. ఎన్‌కౌంటర్ జరుగుతోంది” అని ఆయ‌న చెప్పారు. 

2018 ఫిబ్రవరిలో సుంజ్వాన్ ఆర్మీ కంటోన్మెంట్‌ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకొని కాల్పులు జ‌రిపారు. ఇందులో చాలా మంది మ‌ర‌ణించారు. కాగా కాశ్మీర్ లోయలో గత నెల రోజుల నుంచి తీవ్రవాద ఘటనలు ఊపందుకున్నాయి. ఈ లక్షిత దాడుల్లో నలుగురు పంచాయితీ సభ్యులు మరణించారు. దీంతో పాటు అనేక మంది వలస కార్మికులు గాయపడ్డారు. నిన్న బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం ఉదయం ప్రారంభమైన ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.ఆ ప్రాంతంలో మరికొంత మంది ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి.