సీఆర్‌పీఎఫ్ క్యాంప్ క్యాంపు పై మావోయిస్టులు దాడి చేయడంతో ముగ్గురు జవాన్ల కు గాయాలు అయ్యాయి. వారంతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మావోయిస్టులు దాడి చేయడంతో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కూడా ఎదురుదాడికి దిగారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ లో చోటు చేసుకుంది. 

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం సుక్మా జిల్లా (Sukma district) ఎల్మగుండ (Elmagunda) ప్రాంతంలోని సీఆర్‌పీఎఫ్ క్యాంపు (CRPF camp)పై మావోయిస్టులు (Maoists) కాల్పులు జరపడంతో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ సిబ్బందికి గాయాలయ్యాయని బస్తర్ (Bastar)లోని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు. భద్రతా శిబిరంపై దాడి చేసేందుకు మావోయిస్టులు దేశంలోనే తయారు చేసిన ఆయుధాలను ఉపయోగించారని వారు చెప్పారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం కాల్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే CRPF 2వ బెటాలియన్ ప్రతీకారం తీర్చుకుంది.ఈ కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ హేమంత్ చౌదరి (Hemant Chaudhary), కానిస్టేబుళ్లు బసప్ప (Basappa), లలిత్ బాగ్ (Lalit Bagh)లకు గాయాలయ్యాయి. ప్ర‌స్తుతం వారి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంది. వారందరినీ మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్‌కు విమానంలో త‌ర‌లించామ‌ని బస్తర్ ఐజీపీ సుందర్‌రాజ్ (IGP Sundarraj) తెలిపారు.

మావోయిస్టులు కాల్పులు జరపడమే కాకుండా స్థానికంగా తయారైన గ్రెనేడ్లను కూడా విసిరినట్లు అక్కడ ఉన్న అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి ప్రారంభంలో ఏర్పాటు చేసిన ఎల్మగుండ శిబిరంలో మార్చి 18న హోలీ మిలన్ (Holi Milan) కార్యక్రమాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పౌర చర్య కార్య‌క్ర‌మం కింద సమీపంలోని గ్రామాలకు మందులు, ఇతర వ‌స్తువులు పంపిణీ చేశారు. గ్రామస్తులను భ‌ద్ర‌తా సిబ్బంది భోజ‌నానికి ఆహ్వానించారు. 

రెండేళ్ల క్రితం ఎల్మగుండ నుంచి తిరిగి వస్తుండగా మావోయిస్టులు మెరుపుదాడి చేయడంతో మినపాలో 17 మంది డీఆర్‌జీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి మినప, ఎల్మగుండలో సీఆర్‌పీఎఫ్‌ శిబిరాలు మావోయిస్టులకు వ్యతిరేకంగా దూకుడుగా సాగుతున్నాయని సీనియర్‌ అధికారులు తెలిపారు. “ ప్ర‌స్తుతం జ‌రిగిన ఘ‌ట‌న‌పై మేము శిబిరం, అడవి చుట్టూ ఉన్న మొత్తం ప్రాంతాన్ని వెతుకుతున్నాం. ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. సమగ్ర దర్యాప్తు జరుపుతాం’’ అని ఐజీపీ సుందర్‌రాజ్ చెప్పారు.