ఆ విషయంలో ప్రధాని మోడీని మెచ్చుకున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సమర్థించారు. శాంతి కోసం పాటుపడుతూనే.. దేశ సార్వభౌమాధికారం, ఆర్థిక ప్రయోజనాలకూ ప్రాధాన్యతను ఇవ్వడం సరైన పద్దతి అని వ్యాఖ్యానించారు.
దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగే జి-20 సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చాలా మంది అతిథులు హస్తినాకు చేరుకున్నారు. విదేశీ అతిథులందరికీ బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు ఈ సదస్సు నేపథ్యంలో రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది. కొందరూ మోడీ సర్కార్ సాధించిన ఘనతగా హైలెట్ చేస్తుంటే.. మరికొందరూ మాత్రం ఇదొక సాధారణ పరిణామంగా పేర్కొంటూ.. కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఓ ఇంగ్లిష్ దినపత్రికకు శుక్రవారం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన జీ 20 సదస్సుకు సంబంధించి అనేక ముఖ్యమైన విషయాలను హైలైట్ చేసారు. ఈ సదస్సు నిర్వహణలో భారతదేశ పాత్రను కూడా హైలైట్ చేశారు. ప్రస్తుత ప్రపంచ దృష్టాంతంలో భారతదేశంపైనే ఉందనీ, ఈ సదస్సు నిర్వహణలో మన దేశ పాత్ర ముఖ్యమని మన్మోహన్ సింగ్ నొక్కిచెప్పారు.
రష్యా - ఉక్రెయిన్ యుద్దాన్ని ఒక వర్గం వ్యతిరేకంగా ఉండగా, మరొక వర్గం యుద్ధానికి మద్దతిస్తోంది. అటువంటి పరిస్థితిలో భారతదేశం అనుసరిస్తున్నవైఖరి చాలా కీలకమని అన్నారు. ఒకవైపు శాంతి కోసం పాటుపడుతూనే.. మరోవైపు దేశ సార్వభౌమాధికారానికీ, ఆర్థిక ప్రయోజనాలకూ ప్రాధాన్యతను ఇవ్వడం సరైన వైఖరని మాజీ ప్రధాని అన్నారు. భారతదేశ అభివృద్ధి పట్ల మనమందరం ఆశాజనకంగా ఉన్నామని, మన ఆశావాద వైఖరి మన దేశ అభివృద్ధికి కారకంగా మారుతుందని అన్నారు.
ఇంతలో 2008 ఆర్థిక మాంద్యం ఉదహరిస్తూ.. ఆ కాలంలో G-20 ఒక ముఖ్యమైన పాత్ర పోషించిందని, ఈ సంస్థను ప్రశంసించాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. భారతదేశం తన సార్వభౌమాధికారం, ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సరైన పని చేసిందనీ, శాంతి కోసం కూడా విజ్ఞప్తి చేసిందని మన్మోహన్ సింగ్ అన్నారు.
దేశీయ రాజకీయాల కోసం విదేశాంగ విధానాన్ని ఉపయోగించుకోవడంపై కూడా ఆయన హెచ్చరికలు చేశారు. మాజీ ప్రధాని ఇంకా మాట్లాడుతూ.. 'తన కాలంతో పోలిస్తే దేశీయ రాజకీయాల కంటే విదేశాంగ విధానం చాలా ముఖ్యమైనది. పార్టీ రాజకీయాల కోసం దౌత్యాన్ని ఉపయోగించుకునేటప్పుడు సంయమనం పాటించడం అవసరమని మాజీ ప్రధాని అన్నారు.
మాజీ ప్రధాని ఇంకా మాట్లాడుతూ, '"నా జీవిత కాలంలో భారతదేశానికి G20 అధ్యక్షత వహించే అవకాశం లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. G20 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇవ్వడం కోసం నేను ఎదురుచూస్తున్నాను. విదేశాంగ విధానం ఎల్లప్పుడూ భారతదేశ పాలనా నిర్మాణంలో ఒక ముఖ్యమైన అంశంగా ఉంది, అయితే ఇది మునుపెన్నడూ లేనంతగా నేడు దేశీయ రాజకీయాలకు మరింత సందర్భోచితంగా, ముఖ్యమైనదిగా మారింది. దేశీయ రాజకీయాల్లో ప్రపంచంలో భారతదేశ స్థానం ఒక సమస్యగా ఉండవలసి ఉండగా, పార్టీ లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం దౌత్యం మరియు విదేశాంగ విధానాన్ని ఉపయోగించడంలో సంయమనం పాటించడం కూడా అంతే ముఖ్యం." అని పేర్కొన్నారు.
డా. మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. '2005 నుండి 2015 వరకు దశాబ్దంలో జిడిపిలో భారతదేశ విదేశీ వాణిజ్యం రెండింతలు పెరిగింది. ఇది మనకు ఎంతో ప్రయోజనం చేకూర్చింది. వందల కోట్ల మంది ప్రజలను పేదరికం నుండి బయటపడేసింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో మరింత కలిసిపోయిందని కూడా దీని అర్థం. 2008 ఆర్థిక సంక్షోభ సమయంలో G20 విధాన ప్రతిస్పందనలను సమన్వయం చేయడంలో ప్రపంచ ఆర్థిక భద్రతా వలయాన్ని బలోపేతం చేయడంలో, ప్రభుత్వాల మధ్య సమన్వయ ప్రక్రియను ప్రారంభించడంలో గొప్ప పని చేసింది. ప్రస్తుతం డి-గ్లోబలైజేషన్ , కొత్త రకాల వాణిజ్య పరిమితుల గురించి చర్చ జరుగుతోంది.వివాదాలలో చిక్కుకోకుండా.. వివిధ దేశాలు, ప్రాంతాల మధ్య వాణిజ్య సంబంధాల సమతుల్యతను కొనసాగించడం వల్ల భారతదేశానికి ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది ' అని అన్నారు.