మణిపూర్ హింసాకాండపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో మరోమారు విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది.
మణిపూర్ హింసాకాండపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో మరోమారు విచారణ జరిగింది. ఈ సందర్భంగా మణిపూర్ హింసాకాండపై సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్ హింసాకాండపై దర్యాప్తు కాకుండా.. సహాయ, పునరావాస చర్యలను పరిశీలించేందుకు హైకోర్టు మాజీ మహిళా న్యాయమూర్తులతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ముగ్గురు న్యాయమూర్తుల కమిటీకి జస్టిస్ గీతా మిట్టల్ నేతృత్వం వహిస్తారని.. జస్టిస్ షాలినీ జోషి, జస్టిస్ ఆషా మీనన్‌లు కూడా సభ్యులుగా ఉంటారని సుప్రీంకోర్టు తెలిపింది. విచారణ సందర్భంగా.. మణిపూర్‌లో చట్టబద్ధమైన పాలనపై విశ్వాసం కల్పించడం, విశ్వాసాన్ని పునరుద్ధరించడమే తమ ప్రయత్నమని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఇక, గత విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం జారీ చేసిన ఆదేశాల మేరకు..మణిపూర్ డీజీపీ రాజీవ్ సింగ్ ఈరోజు కోర్టుకు హాజరయ్యారు. అయితే మణిపూర్ హింసాకాండపై విచారణలో భాగంగా కేసులను సీబీఐకి బదిలీ చేశామని..అయితే చట్టబద్ధతపై విశ్వాసం ఉండేలా వివిధ రాష్ట్రాల నుంచి సీబీఐలోకి తీసుకురావాల్సిన ఐదుగురు అధికారులు కనీసం డిప్యూటీ ఎస్పీ ర్యాంక్‌లో ఉండేలా నిర్దేశించాలని ప్రతిపాదిస్తోంది. ఇక, సీబీఐకి బదిలీ కాని కేసులను 42 సిట్‌లు పరిశీలిస్తాయి.
విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి.. ఆరు హింసాత్మక జిల్లాలకు సీనియర్ పోలీసు అధికారులతో కూడిన సిట్‌లు ఉంటాయని అన్నారు. ఎస్పీ నేతృత్వంలోని సిట్‌లు జాతి ఘర్షణలు/నేరాలను పరిశీలిస్తాయని తెలిపారు. మణిపూర్‌లో మహిళలపై జరిగే నేరాలను విచారించేందుకు, మహిళా పోలీసు అధికారుల బృందంతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేస్తారని.. డీఐజీ, డీజీపీ ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తారని ఏజీ తెలిపారు.
మణిపూర్‌లో హింసాకాండ సందర్భంగా మహిళలపై జరిగిన నేరాలు, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన నేరాలకు సంబంధించి 12 ఎఫ్‌ఐఆర్‌లను సీబీఐ విచారిస్తుందని విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలియజేశారు.
