ఫోనుకు పెళ్లికి ముడిపెట్టాడో యువకుడు. తనకు ఇష్టమైన ఫోను దొరికే వరకు పెళ్లి చేసుకోనని మంకుపట్టు పట్టాడు. చివరికి స్వయంగా ఆ కంపెనీనే అతనికి ఫోన్ పంపించి ఇక పెళ్లి చేసుకోవచ్చని చెప్పింది. 

ఈ విచిత్ర ఘటన ఢిల్లీలో జరిగింది. ఇష్టపడే ఫోనుపై మోజు ఎంతదూరం పోతుందనేందుకు తాజా ఉదాహరణగా నిలిచాడు కమల్‌ అహ్మద్‌. స్మార్ట్‌ ఫోన్‌ యుగంలో రోజుకు ఎన్నో రకాల మోడళ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. కొన్ని ఫోన్లైతే కస్టమర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఫోన్ల మోజున్న వ్యక్తుల్లో కమల్‌ ఒకరు. 

అతనికి ఎంఐ కంపెనీకి చెందిన ఫోన్లంటే బాగా ఇష్టం. ఆ కంపెనీ రూపొందించిన ఎంఐ 10టీ ప్రో ఫోను తన చేతికి వచ్చేవరకు పెళ్లి కూడా చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు. ఇతని పిచ్చే ఆశ్చర్యం అనుకుంటే, అంతకుమించిన ఆశ్చర్యాన్నిస్తూ కలిగిస్తూ ఆ సదరు కంపెనీ కమల్‌కు నచ్చిన ఫోనును పంపింది. 

‘‘ఎంఐ 10టీ ప్రో ఫోను దొరికే వరకు పెళ్లి చేసుకోను’’ అని డిసెంబర్‌ 11న కమల్‌ ట్వీట్ చేశాడు. ఆ తరువాత డిసెంబర్‌ 21న ఫోను తన చేతికి వచ్చిందని చెబుతూ దాని గుణగణాలు వర్ణిస్తూ మరో ట్వీట్‌ చేశాడు. షామీ ఇండియా హెడ్‌ మను కుమార్‌ జైన్‌కు కృతజ్ఞతలు కూడా చెప్పాడు. 

ఆయన కూడా సరదాగా ప్రతిస్పందిస్తూ ఇక కమల్‌ పెళ్లికి రెడీ కావచ్చని ట్వీట్‌ చేశాడు. ఇంతకీ కంపెనీ ఆయనకు నిజంగా ఫ్రీగా ఫోను ఇచ్చిందా? లేదా అని ఆరాతీయగా, ఎంఐ ఫ్యాన్‌ అయిన కమాల్‌ కంపెనీకి సంబంధించిన పలు ఇమేజ్‌ బిల్డింగ్‌ కార్యక్రమాల్లో పాల్గొంటాడని, అనుకోకుండా తనకు లక్‌ కలిసివచ్చి ఫోను పొందేందుకు కూపన్‌ గెలుచుకున్నాడని కంపెనీ ప్రతినిధి చెప్పారు. ఎలాగైతేనేం కమల్‌ విషయంలో మాత్రం ‘కమాల్‌’ జరిగిందనుకోవచ్చు.