భార్య మీద కోపంతో ఓ వ్యక్తి అత్యంత పైశాచికంగా వ్యవహరించాడు. తన కోపాన్నంతటినీ.. ఆరునెలల కుమార్తెపై చూపించాడు. అభం శుభం తెలియని పసిదాని గొంతుని చాక్ తో కోసేసాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి వివాహం జరిగి.. ఆరు నెలల కుమార్తె ఉంది. అయితే.. ఆదివారం రాత్రి భార్య, భర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. భార్య తన పక్కింటి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తన ఆరునెలల కుమార్తె గొంతుని కత్తితో కోసేశాడు. 

వెంటనే ఆమె పాపను సమీప ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాప వోకల్ కార్డ్ పూర్తిగా తెగిపోయిందని డాక్టర్లు తెలిపారు. పాపకు మాటలు రావడం కష్టమని వారు తేల్చిచెప్పారు. కాగా.. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారించారు. 

ఆ పాప.. తనకు పుట్టలేదని.. వేరే వ్యక్తి కారణంగా పుట్టిందంటూ.. చుట్టుపక్కల వారు మాట్లాడుకోవడం తాను విన్నానని.. అందుకే  పాప పట్ల అలా ప్రవర్తించానని నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించారు.  ఈ విషయంపై పోలీసులు కుటుంబసభ్యులను, ఇరుగు పొరుగువారిని విచారించారు.

నిందితుడు డ్రగ్స్ కి బానిసగా మారి.. భార్యను విపరీతంగా కొట్టేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.  ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.