శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచం దూసుకుపోతుంటే మనిషి ఇంకా మూఢనమ్మకాలను, అంధ విశ్వాసాలను ఫాలో అవుతూనే ఉన్నాడు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో నారాయణీ దేవి అనే మహిళ తన 11 మంది కుటుంబసభ్యులతో కలిసి సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

అందరూ ఒకేసారి, ఒకే ముహూర్తంలో చనిపోతే మోక్షం ప్రాప్తిస్తుందని ఎవరో బాబా చెప్పాడని వారు బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా తల్లిని ఖననం చేయకుండా 18 రోజుల పాటు ఉంచితే ఆమెకు ఉత్తమ లోకం వస్తుందని ఓ కొడుకు తల్లి శవంతో గడిపాడు.

వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఓ ఇంటి మీదుగా వెళుతున్న స్థానికులకు దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపుతు బద్దలు కొట్టి చూడగా.. మైత్రేయ భట్టాచార్య అనే వ్యక్తి.. తన తల్లి కృష్ణా భట్టాచార్య శవం పక్కనే కూర్చొని ఉన్నాడు.

మృతదేహం బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది.. పోలీసులు అతనిని విచారించగా.. తాము హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారామని, తమ మత ఆచారాల ప్రకారం మృతదేహాన్ని 21 రోజుల తర్వాత ఖననం చేస్తే ఉత్తమ లోకాలకు వెళతారని అందుకే ఎదురుచూస్తున్నానని తెలిపాడు.

 ఎంసీఏను మధ్యలోనే ఆపేసిన మైత్రేయ నిరుద్యోగి.. తల్లి టీచర్‌గా పనిచేసి రిటైర్ అవ్వగా.. వైద్యుడిగా పనిచేసిన తండ్రి 2013లో ఒంటికి నిప్పంటించుకుని అనుమానాస్పద స్థితిలో మరణించారు. తండ్రికి వచ్చే పింఛన్ డబ్బుతోనే తల్లికొడుకులు జీవిస్తున్నారు.