కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ లక్షల మందికి సోకుతుండగా.. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మరీ ముఖ్యంగా ఈ వైరస్ కారణంగా జనాల్లో మానవత్వం అనేది లేకుండా పోతోంది.  కళ్ల ముందే ప్రాణం పోతున్నా.. కనీసం అక్కడ ఉన్నది తనవాళ్లు అయినా పట్టించుకోవడం లేదు. తాజాగా ఇలాంటి సంఘటనే బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. భార్యకు కరోనా వచ్చిందని .. భర్త దూరంగా పారిపోయాడు. కనీసం పట్టించుకునేవారు లేక సదరు యువతి ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయిందిద.

పూర్తి వివరాల్లోకి వెళితే... జేపీ నగర, శంకరమఠం వార్డుకి చెందిన గౌరి(27) కి పెళ్లయ్యి భర్త మంజునాథ్ తో కలిసి జీవిస్తోంది. వీరు రెండేళ్ల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఉత్తర  కర్ణాటక ప్రాంతం నుంచి ఉపాధి కోసం వచ్చి బెంగళూరులో అద్దెకు ఉంటున్నారు. కాగా.. గౌరి ఓ షాపింగ్ మాల్ లో సేల్స్ ఉమేన్ ఉద్యోగం చేస్తుండగా.. మంజునాథ్ డ్రైవర్ గా పనిచేసవాడు.

ఇటీవల గౌరికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. శ్వాస తీసుకోవడం లో కూడా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. ఆమెకు అండగా నిలిచి ప్రాణాలు కాపాడాల్సిన భర్తే చేతులు ఎత్తేశాడు. భార్యను అక్కడే వదిలేసి తాను మాత్రం పరారయ్యాడు. కాగా.. తీవ్ర శ్వాస సమస్యలు తలెత్తి యువతి ఇంట్లో ప్రాణాలు విడిచింది. కనీసం అంత్యక్రియలు చేయడానికి కూడా భర్త రాకపోవడం గమనార్హం.

యువతి తరపు బంధువులకు సమాచారం అందించగా.. వారు కూడా పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రేమించి పెళ్లి చేసుకుందని.. అప్పుడే తనతో తమకు సంబంధాలు తెగిపోయానని తేల్చిచెప్పడం గమనార్హం. కాగా.. మున్సిపల్ సిబ్బంది ముందుకు వచ్చి.. తర్వాతి కార్యక్రమాలు నిర్వహించారు.