జన్మనిచ్చి.. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి.. ఉన్నత చదువులు చదివించిన కన్న తండ్రినే ఓ వ్యక్తి చంపేయాలని అనుకున్నాడు. ఆస్తి కోసం తండ్రిని కిడ్నాప్ చేసి అనంతరం  విషమిచ్చిచంపాలని అనుకున్నాడు. దీని కోసం ఓ కిల్లర్ ని  ఏర్పాటు చేశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

స్థానికంగా నివశించే ఓ బిల్డర్‌ను అతని కుమారుడే అంతమొందించాలనుకున్నాడు. పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకున్న తండ్రి ఆమెకు డబ్బు, ఆస్తులు ఇవ్వడాన్ని అతను సహించలేకపోయాడు. తాను డబ్బు అడిగితే ఇవ్వకుండా, అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు ఇవ్వడంతో ఆగ్రహోదగ్ధుడైపోయాడు. ఆ కోపంలోనే ఓ కిల్లర్‌ను సంప్రదించాడు. 

తన తండ్రిని కిడ్నాప్ చేసి విషమిచ్చి చంపాలని చెప్పాడు. దీనికోసం రూ.10లక్షలు ఇస్తానని చెప్పాడు. ముందుగా రూ.3లక్షలు ఇచ్చి, మిగతా సొమ్ము పని పూర్తయ్యాక ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. అయితే ఈ విషయం కాస్త పోలీసులకు తెలిసిపోయింది. దీంతో వారు రంగంలోకి దిగారు.  ప్రస్తుతం సదరు బిల్డర్ కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు.