ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోడానికి భవనం పైనుండి దూకి ధైర్యంచాలక బాల్కనీని పట్టుకుని వేలాడుతున్న ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాాబాద్ లో చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
న్యూడిల్లీ: ఏ కష్టం వచ్చిందో ఏమోగానీ ఇంటి పైనుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇలా ఆత్మహత్యకు యత్నించిన అతడికి చివరిక్షణంలో ధైర్యం చాలలేదు. దీంతో బాల్కనీలో వేలాడుతూ కనిపించగా కుటుంబసభ్యులు గమనించి కాపాడారు. ఇలా అతడు బాల్కనీలో వేలాడుతుండగా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇదికాస్తా బాగా వైరల్ అయి అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడమే కాదు ప్రధాన మీడియాలకు వార్తగా మారింది.

ఈ వీడియోలో ఓ వ్యక్తి ఇంటి మొదటి అంతస్తులోని బాల్కనీ నుండి వేలాడుతూ కనిపిస్తున్నాడు. అతడిని కాపాడేందుకు కొందరు బాల్కనీలో నిలబడి పైకి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. చివరకు ఎలాగోలా అతడి చేయిపట్టుకుని పైకిలాగిన కుటుంబసభ్యులు ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇలా బాల్కనీలో వేలాడుతున్న వ్యక్తిని కాపాడుతున్న వీడియోపై నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.
భర్త గదిలో కనిపించకపోవడంతో ఇళ్లంతా వెతికిన భార్య బాల్కనీలోకి వెళ్లిచూసింది. భర్త వేలాడుతూ కనిపించడంతో వెంటనే కుటుంబసభ్యులతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే ఇంటి చుట్టుపక్కుల వారు,కుటుంబసభ్యులు బాల్కనీలో వేలాడుతున్న వ్యక్తిని కాపాడి ఇంట్లోకి తీసుకెళ్లారు.
