ప్రియురాలి కళ్లలో ఆనందం చూడాలని ఏకంగా ఆమె భర్తపై దాడి చేశాడో యువకుడు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన సచిన్ యాదవ్ అనే వ్యక్తి ఓ యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు.

ఈ క్రమంలో ఆమెకు వివాహమైనప్పటికీ వారి మధ్య సంబంధం నడిచింది. అయితే ఆ యువతి భర్త ఆమెను హింసిస్తున్నాడని సచిన్‌కు తెలిసింది. తన ప్రేయసి బాధ చూడలేక పోయిన ఆ యువకుడికి.. ఆమె భర్తపై కోపంతో ఊగిపోయాడు. అతనికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకున్నాడు.

దీనిలో భాగంగా శనివారం తన ప్రేయసి భర్త ఓ బర్త్ డే పార్టీకి వెళ్లాడని తెలుసుకున్నాడు. వెంటనే తన ప్లాన్‌ను అమలు చేశాడు. తన తమ్ముడు ఆకాశ్ యాదవ్, మిత్రుడు సాగర్ గుప్తాలను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్లాడు.

ముఖానికి మాస్క్‌లు ధరించి ప్రేయసి భర్తపై దాడి చేసి అతని రెండు చేతులు విరిచేశారు. అనంతరం తలపై బలంగా మోదీ అక్కడి నుంచి పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారభించారు.

దుండగులు  మాస్కులు ధరించినందున పార్టీకి వచ్చిన వారెవరూ నిందితులను గుర్తు పట్టలేకపోయారు. అయినప్పటికి బాధితుడి కుటుంబసభ్యులు, పొరిగింటి వారు ఇచ్చిన సమాచారంతో సచిన్‌, ఆకాశ్‌, సాగర్‌ గుప్తల పేర్లు వెలుగులోకి వచ్చాయి.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సచిన్‌,ఆకాశ్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న మూడో వ్యక్తి సాగర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.