దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ఓ బాలిక అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. కాగా... ఆ బాలిక ప్రస్తుతం చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుందోందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం బాలిక ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

నిందితుడు ఆమె ఒంటిపై పలుచోట్ల పదునైన వస్తువుతో తీవ్రంగా గాయపరిచాడని, తలకు బలమైన గాయమైందని తెలిపారు. ఆమెకు శస్త్రచికిత్స చేశామని, 48 గంటలు గడిస్తేగానీ ఏ విషయం చెప్పలేమన్నారు. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సీరియస్‌ అయ్యారు. గురువారం ఆయన ఎయిమ్స్‌ను సందర్శించి, బాధితురాలి పరిస్థితిని విచారించారు. 

 బాధిత కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. నిందితుడిని గుర్తించి, వెంటనే అరెస్టు చేయాలని.. కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయసాయం అందిస్తామని, సీనియర్‌ లాయర్లను నియమించి.. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. 

ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ స్వాతి మాలివాల్‌ కూడా ఎయిమ్స్‌ను సందర్శించారు. పోలీసు దర్యాప్తులో ఆలస్యంపై ఆమె మండిపడ్డారు. బాధితురాలి ఒంటిపై ప్రతిచోటా రక్తపు గాయాలున్నాయని విలేకరులకు తెలిపారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి 100 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని గుర్తించి, అరెస్టు చేశామన్నారు. 

కాగా..బాధిత బాలిక కుటుంబం ఢిల్లీలోని పశ్చిమ విహార్‌లో నివసిస్తోంది. ఆమె తల్లిదండ్రులు, సోదరి స్థానికంగా ఉన్న గార్మెంట్‌ షాపులో పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం వారంతా విధులకు వెళ్లగా.. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. దీన్ని గమనించిన నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఆ బాలిక ప్రతిఘటించడంతో.. పదునైన వస్తువుతో ఒళ్లంతా గాట్లు పెట్టాడు. తలపై తీవ్రంగా గాయపరిచాడు. తీవ్ర గాయాలపాలైన ఆ బాలిక.. సాయంత్రం 5.30కు ఓపిక తెచ్చుకుని, రక్తమోడుతూ బయటకు వచ్చింది. ఇది గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను తొలుత స్థానిక సంజయ్‌ గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యుల సూచన మేరకు ఎయిమ్స్‌లో చేర్చారు.