కోల్ కతా: ఈస్ట్ - వెస్ట్ మెట్రో కారిడార్ ప్రారంభోత్సవానికి తనను కేంద్రం ఆహ్వానించకపోవడంపై తాను చాలా బాధపడ్డానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధ్యక్షురాలు మమతా బెనర్జీ చెప్పారు ఈ విషయంపై తాను కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఆమె తెలిపారు.

తాను రైల్వే మంత్రిగా పనిచేసినప్పుడు ఆ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపానని, దాని కోసం చాలా కష్టపడ్డానని, అలాంటిది కోంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడం విడ్డూరమని ఆమె అన్నారు. రాష్ట్ర శాసనసభలో ఆమె ఈ విషయం చెప్పారు.

నిజంగా కన్నీళ్లు పెట్టుకున్నానని, కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వకుండానే ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేశారని ఆమె అన్నారు. ఈస్ట్ - వెస్ట్ రైల్వే కారిడార్ ను గురువారం రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ గురువారంనాడు ప్రారంభించారు. అయితే ఆహ్వాన పత్రికలో టీఎంసీ ప్రజాప్రతినిధుల పేరులు ఎక్కడా లేవు. దీనిపై తృణమూల్ కాంగ్రెసు నేతలు మండిపడుతున్నారు.

ప్రతిపక్షాలు రాజకీయ కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని, బిజెపి ముందు సీపీఎం, కాంగ్రెసు రాజకీయంగా లొంగిపోయాయని ఆమె విమర్శించారు. సీపీఎం దగ్గరవుతున్న కొద్దీ కాంగ్రెసు ప్రాధాన్యాన్ని కోల్పుతుందని ఆమె అన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట్లలో కాంగ్రెసుకు ఉనికి కూడా లేదని ఆమె అన్నారు.