టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ రెండు రోజుల ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా ఈ రోజు లక్నో చేరుకున్నారు. ఈ రెండు రోజులు ఆమె యూపీలో అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె లక్నోలో మాట్లాడుతూ, సమాజ్‌వాదీ పార్టీని గెలిపించాలని, బీజేపీ బూటకపు వాగ్దానాలను నమ్మవద్దని, ఆ పార్టీని ఓడించాలని ప్రజలను కోరారు. 

లక్నో: తృణమూల్ కాంగ్రెస్ చీఫ్(TMC), పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) ఈ రోజు ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) చేరుకున్నారు. అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav) సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party)కి మద్దతుగా ఆమె ఉత్తరప్రదేశ్‌లో ప్రచారం చేయనుంది. దీనికోసం ఆమె రెండు రోజులు యూపీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె యూపీలో బీజేపీపై నిప్పులు చెరిగింది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. 

‘హథ్రాస్, ఉన్నావ్ ఘటనలకు బాధ్యులైన వారిని చరిత్ర ఎప్పటికీ క్షమించదు. కరోనా మహమ్మారి తాండవిస్తున్న కాలంలో గంగా నదీ తీరంలో మృతదేహాలను గుమ్మరించిన వారినీ ఈ చరిత్ర ఎప్పటికీ క్షమించదు’ అని మమతా బెనర్జీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇంతటి దారుణ ఘటనలు జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు యోగీ జీ? ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు యోగి ఆదిత్యానాథ్ కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే అని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.

‘నేను రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఒక్కటే సమాజ్‌వాదీ పార్టీని గెలిపించండి. బీజేపీని ఓడించండి. బీజేపీ పార్టీ చేసే బూటకపు హామీలను విశ్వసించకండి’ అంటూ ఆమె అఖిలేశ్ యాదవ్ పార్టీకి మద్దతు ఇచ్చారు. మార్చి 3వ తేదీన తాను వారణాసి కూడా పర్యటించనున్నట్టు వెల్లడించారు. ఆమె ఈ రోజు లక్నలో ప్రజలను ఉద్దేశించి సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుగా మాట్లాడారు.

రెండు రోజుల పర్యటనకు పశ్చిమ బెంగాల్ నుంచి లక్నో ఎయిర్‌పోర్టులో దిగిన మమతా బెనర్జీని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్వాగతించారు. ఈ రెండు రోజులపాటు ఆమె సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. 

మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్‌లు కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్ బీజేపీపై విమర్శలు కురిపించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దాని బలాన్ని మొత్తం ప్రయోగించిందని పేర్కొన్నారు. కానీ, దీదీని ఓడించలేక ఢీలా పడిపోయారని అన్నారు. ఆమె ఇప్పుడు కోల్‌కతా నుంచి లక్నోకు వచ్చారని, కానీ, బీజేపీ మాత్రం ‘బ్యాడ్ వెదర్’ కారణంగా ఢిల్లీ నుంచి యూపీకి రాలేకపోయిందని విమర్శించారు. అబద్ధాలతో నిండిన బీజేపీ విమానం ఈ సారి ఉత్తరప్రదేశ్‌లో ల్యాండ్ కాలేకపోయిందని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం యూపీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ డబుల్ ఇంజన్ ప్ర‌భుత్వం వ‌ల్ల ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో ఎంతో అభివృద్ధి జ‌రిగింద‌ని చెప్పారు. దేశానికి స్వాతంత్రం వ‌చ్చి 100 సంవత్సరాలు పూర్తి అయిన‌ప్పుడు యూపీ అభ‌వృద్ధి విజయగాథతో సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఉత్తరప్రదేశ్ కోసం మాకు భారీ ఆకాంక్షలు ఉన్నాయి అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘‘ యూపీ అభివృద్ధి నదిలో నీరు నిలిచిపోయింది. ఇది నకిలీ సమాజ్‌వాదీలు, వారి సన్నిహితుల మధ్య స్తబ్దుగా ఉంది. వీరికి సామాన్యుల అభివృద్ధి దాహం, ప్రగతి దాహంతో ఎప్పుడూ సంబంధం లేదు.’’ అని అన్నారు. ఎస్పీ- బీఎస్పీ ( SP-BSP ) తమ దాహార్తిని, వారి సన్నిహితుల దాహాన్ని తీర్చుకుంటూనే ఉన్నాయని ప్రధాని అన్నారు.