'వి వాంట్ జస్టిస్'.. రెజ్లర్లకు మద్దతుగా నిలిచిన మమతా బెనర్జీ
దేశవ్యాప్తంగా రెజ్లర్లకు చాలా మంది మద్దతు లభిస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా వారికి సపోర్టు ఇచ్చారు. కోల్‌కతాలో రెజ్లర్లకు మద్దతుగా చేపట్టిన ర్యాలీలో కూడా ఆమె పాల్గొన్నారు. ఆమె చేతిలో 'వి వాంట్ జస్టిస్' అనే పోస్టర్ పట్టుకుని, భారతదేశంలోని రెజ్లర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

దేశరాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన రెజ్లర్లకు మద్దతుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలిచారు. వారికి మద్దతుగా కోల్‌కతాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. 'మాకు న్యాయం కావాలి' అని రాసి ఉన్న ప్లకార్డును బెనర్జీ చేతిలో పట్టుకుని ముందుకు సాగారు. కోల్‌కతాలోని దక్షిణ ప్రాంతం హజ్రా రోడ్డు కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ రవీంద్ర సదన్ వరకు సాగింది. మమతా బెనర్జీ తన నియోజకవర్గం భబానీపూర్‌లో 2.8 కిలోమీటర్ల ర్యాలీలో పాల్గొన్నారు.
సీఎం మమతా బెనార్జీతో పాటు మాజీ మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులు కుంటాల ఘోష్ దస్తిదార్,శాంతి మాలిక్, మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారులు అల్విటో డి'కున్హా, రహీమ్ నబీ, డిపెందు బిస్వాస్,అనేక ఇతర క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. మంత్రి అరూప్ బిస్వాస్, మంత్రి మనోజ్ తివారీ ఆధ్వర్యంలో నిరసన తెలిపిన రెజ్లర్లకు సంఘీభావం తెలిపేందుకు క్రీడా శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
బ్రిజ్ ను అరెస్టు చేయాలని డిమాండ్
పలువురు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన ఆరోపణలపై భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ , బజరంగ్ పునియాతో సహా దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్లు వందలాది మంది మద్దతుదారులతో కలిసి గంగా నదిలో తమ పతకాలను నిర్జనం చేయడానికి యత్నించిన తరువాత రోజు ఈ ర్యాలీ నిర్వహించబడింది.
రెజర్ల తమ పతకాలను నదిలో పారేయబోయారు. ఖాప్, రైతు నాయకుల జోక్యం తరువాత వారు ఆ నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 23 నుంచి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు నిరసనలు చేస్తున్నారు. మే 28న కొత్త పార్లమెంట్ భవనం వైపు కవాతు చేసేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు జంతర్ మంతర్ నుంచి తొలగించారు. అదుపులోకి తీసుకున్న అనంతరం విడుదల చేశారు.