పీఏ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ఏకంగా జిల్లా కలెక్టర్‌పై హత్య కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ఒడిషాలోని మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌ మనీష్‌ అగర్వాల్‌ వద్ద పీఏగా పని చేసిన దేవ్‌ నారాయణ పండా గత ఏడాది డిసెంబర్‌ 26న అనుమానాస్పదంగా మృతి చెందాడు.

ఆయన మృతదేహాన్ని సతిగుడ జలాశయంలో గుర్తించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించాల్సిన అధికారులు ఇప్పటివరకు ఎటువంటి విచారణ చేపట్టలేదు.

దీంతో మనస్తాపానికి గురైన దేవ్‌ నారాయణ పండా భార్య వనజ పండా తన భర్త అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టాలంటూ కోర్టును ఆశ్రయించారు.

దీనిపై స్పందించిన కోర్టు మల్కన్‌గిరి పోలీస్‌స్టేషన్‌కు ఆదేశాలు జారీ చేయడంతో కలెక్టర్‌ మనీష్‌ అగర్వాల్, మరో ముగ్గురు కలెక్టరేట్‌ సిబ్బందిపై హత్య కేసు నమోదు చేశారు.

కలెక్టర్‌పై హత్య కేసు నమోదు కావడంతో ఆయన స్థానంలో మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌గా ఎద్దుల విజయ్‌కుమార్‌ను నియమిస్తూ ఒడిషా సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.