కరోనా మహమ్మారి ని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కాగా..  ఈ లాక్ డౌన్ సమయంలో  చాలా మంది ఆర్థికంగా వెనకపడిపోయారు. ఇక ఈ లాక్ డౌన్ పీరియడ్ లో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య అయితే లెక్కేలేదు.  కాగా.. అలాంటి పరిస్థితినే ఓ వ్యక్తి ఎదుర్కొన్నాడు. లాక్ డౌన్ లో ఉద్యోగం కోల్పోయి.. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం టీ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే.. తాను టీ అమ్ముకోవడం ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నానంటూ అతను చెప్పడం గమనార్హం.

‘లాక్‌డౌన్ సమయంలో ప్రపంచమంతా ఆర్థికంగా దెబ్బతింది. నా పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. 10 గంటల పాటు ఉద్యోగం చేసి, నెలకు రూ. 12 వేలు సంపాదించేవాడిని. లాక్‌డౌన్‌లో రెండుమూడు నెలలు ఖాళీగా ఇంట్లోనే కూర్చోవలసి వచ్చింది. దీంతో డబ్బులు లేక ఇబ్బందులు పడాల్సివచ్చింది. దీంతో టీ విక్రయించడం ప్రారంభించాను. మొదట్లో నడుస్తూనే టీ విక్రయిస్తూ వచ్చాను. తరువాత సైకిల్‌పై టీ విక్రయించడం ప్రారంభించాను.

ప్రస్తుత నా సంపాదన నెలకు రూ. 40 వేలకు చేరుకుంది.... ఈ మాట చెబుతున్నప్పుడు మహేంద్ర ముఖం వెలిగిపోయింది. 40 ఏళ్ల వయసుగల మహేంద్ర వర్మ ఢిల్లీలోని టికరీ బార్డర్ ప్రాంతంలో సైకిల్‌పై టీ విక్రయిస్తుంటాడు. టీ రూ. 5కు, కాఫీ రూ.10కి విక్రయిస్తున్నాడు. చలికాలంలో టీ, కాఫీ విక్రయాలు జోరుగా సాగుతున్నాయని, పాత సైకిల్ వెనుక ట్రే అమర్చి, వాటిలో టీ ప్లాస్కులు ఉంచి, విక్రయాలు సాగిస్తున్నానని తెలిపాడు. ఉద్యోగం కన్నా ఈ వ్యాపారమే లాభదాయకంగా ఉందని, దీనినే కొనసాగిస్తానని మహేంద్ర వర్మ తెలిపారు.