మహారాష్ట్రలో గవర్నర్- ముఖ్యమంత్రుల మధ్య వివాదం ముదిరింది. గవర్నర్ విమానంలో ప్రయాణించేందుకు ఉద్దవ్ థాక్రే సర్కార్ అనుమతించకపోవడంతో ఆయన ప్రైవేటు విమానంలో డెహ్రడూన్ వెళ్లారు.
మహారాష్ట్రలో గవర్నర్- ముఖ్యమంత్రుల మధ్య వివాదం ముదిరింది. గవర్నర్ విమానంలో ప్రయాణించేందుకు ఉద్దవ్ థాక్రే సర్కార్ అనుమతించకపోవడంతో ఆయన ప్రైవేటు విమానంలో డెహ్రడూన్ వెళ్లారు.
కాగా, ఉత్తరాఖండ్‌లో ఇటీవల సంభవించిన మెరుపు వరదల గురించి తెలుసుకునేందుకు గాను మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ విమానంలో డెహ్రడూన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా గురువారం ముంబైలోని విమానాశ్రయానికి వెళ్లి రెండు గంటల పాటు వేచి ఉన్నారు.
అనంతరం ప్రభుత్వ విమానమెక్కి కూర్చొన్నారు. అయితే 15 నిమిషాల తర్వాత టేకాఫ్‌కు అనుమతి రాలేదని ఎయిర్‌క్రాఫ్ట్ కెప్టెన్ చెప్పారు. దీంతో కోశ్యారి చివరికి మరో విమానంలో టికెట్ బుక్ చేసుకొని డెహ్రాడూన్ వెళ్లాల్సి వచ్చింది.
వారం కిందటే గవర్నర్ పర్యటన గురించి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినా అనుమతి రాకపోవడంపై గవర్నర్ కార్యాలయ వర్గాలు భగ్గుమన్నాయి. దీనిపై ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందించారు.
గవర్నర్‌కు విమానం ఇచ్చారో లేదో తనకు తెలియదని, కార్యాలయానికి వెళ్లి తెలుసుకుంటానని వెల్లడించారు. అటు శివసేన ఎంపీ వినాయక్ రౌత్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు.
ప్రభుత్వ విమానాన్ని వినియోగించుకునేందుకు గవర్నర్‌కు అనుమతి లేదని అయితే ఆయన ప్రభుత్వ అనుమతి కోరారని అయితే ఆ విమానం ప్రయాణించగలదా లేదా అని తెలియలేదని రౌత్ పేర్కొన్నారు. ఈ కారణంగానే గవర్నర్‌కి అనుమతి లభించకపోయి ఉండవచ్చని వినాయక్ తెలిపారు.
అయితే సీఎం, డిప్యూటీ సీఎం మాత్రమే ప్రభుత్వ విమానాన్ని వినియోగించుకునేందుకు హక్కు ఉంది. ఇతరులు వాడాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ కారణంగానే గవర్నర్ ప్రయాణానికి అనుమతి లభించలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కానీ కక్షపూరితంగానే ప్రభుత్వం గవర్నర్‌కు విమానం అనుమతి ఇవ్వలేదని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాగా గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి మధ్య వివాదాలు నెలకొనడం ఇదే మొదటిసారి కాదు. లాక్‌డౌన్ అనంతరం రాష్ట్రంలో ఆలయాలను తెరిచేందుకు థాక్రే సర్కార్ అనుమతివ్వకపోవడంపై కోశ్యారీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దీనిపై సీఎం , గవర్నర్‌కు మధ్య లేఖల యుద్ధం సైతం నడిచింది. తాజాగా ఇప్పుడు విమాన అనుమతి వ్యవహారం ఇద్దరు నేతల మధ్య చిచ్చు రేపు అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
