ఆరు హత్యలు చేసిన ఓ సైకో కిల్లర్ ను మధ్రప్రదేశ్ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.  గుజరాత్, దాహూద్ కు చెందిన దిలీప్ దేవాల్ అనే సైకో కిల్లర్ వివిధ రాష్ట్రాల్లో ఆరు హత్యలు చేశాడు. ఒంటరిగా ఉండేవాళ్లు, వృద్ధులు టార్గెట్ గా దిలీప్ హత్యలకు, దోపిడీలకు పాల్పడేవాడు.

మధ్యప్రదేశ్ లోని రత్లాంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో సైకో కిల్లర్ దేవాల్ హతం కాగా, ఈ కాల్పుల్లో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

నవంబరు 25వతేదీ దీపావళి పండగ రోజు ఈ సైకో కిల్లర్ న రత్లాంలోని ఒకే కుటుంబంలో ముగ్గురిని కాల్చిచంపాడు. జూన్ లో ఓ మహిళను హతమార్చాడు. రత్లాంలోని ఓ కుటుంబం ఇటీవల భూమి అమ్మగా పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయని, అవి ఇంట్లో ఉన్న సంగతి తెలిసి దిలీప్ దోపిడీకి వచ్చాడు. ఆ క్రమంలో ముగ్గురినీ కాల్చి చంపాడని పోలీసులు చెప్పారు. 

వృద్ధులున్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దేవాల్ తన అనుచరులతో కలిసి నేరాలకు పాల్పడతాడని తేలింది. ఇంట్లో ఉన్నవారికి హతమార్చి దోపిడీలు చేశాడని పోలీసులు చెప్పారు.సైకో కిల్లర్ అనుచరులైన అనురాగ్ మెహర్, గౌరవ్ బిల్వాల్, లాలాభాభోర్ లను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.