Madhya Pradesh: కులాంతర వివాహం చేసుకున్న ఓ జంటను వారి కుటుంబాలతో సహా బహిష్కరించారు. వారు మళ్లీ కులంలో కలవడానికి గ్రామంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేయాలనీ, రెండు లక్షల రూపాయలను ఇవ్వాలని గ్రామ పెద్దలు డిమాండ్ చేసిన ఘటన మధ్యప్రదేశ్ లోని దామోహ్ జిల్లాలో చోటుచేసుకుంది.
Madhya Pradesh: సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. కానీ కులాలు, మతాలు, మూఢనమ్మకాలపై నాటుకుపోయిన కొన్ని ఇంకా తొలగిపోవడం లేదు. మరీ ముఖ్యంగా కులాల పేరిట కొట్టుకుచావడం, అంతరాలు పెరగడం ఇంకా కొనసాగుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి కులగజ్జి నేపథ్యంలోనే.. ఓ జంట (inter-caste couple)ను గ్రామం నుంచి బహిష్కరించారు. వారి ఐదేండ్ల కొడుకును సైతం ఇతర పిల్లలో ఆడుకోనివ్వడం లేదు. అయితే, తిరిగి తమ కుల సంఘంలోకి వారిని అనుమతించడానికి రెండు లక్షల రూపాయలను డిమాండ్ చేశారు గ్రామ పెద్దలు. దీంతో తప్పని పరిస్థితుల్లో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని పౌడి (Paudi village) గ్రామంలో కులాంతర వివాహం చేసుకున్న దంపతులు తమను తిరిగి సంఘంలోకి అనుమతించడానికి బదులుగా గ్రామ పెద్దలు, సంఘం సభ్యులు తమ నుండి రూ. 2 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. కాగా, ఆరేండ్ల క్రితం రాజేష్ ప్రజాపతి-జ్యోతి ఉతయలు కులాంతర వివాహం (INTERCASTE MARRIAGE) చేసుకున్నారు. దీంతో వారి కుటుంబాలతో పాటు ఈ జంట కూడా గ్రామ పంచాయతీ ద్వారా కుల బహిష్కరణకు గురయ్యారు. ఓబీసీ వర్గానికి చెందిన ప్రజాపతి.. షెడ్యూల్డ్ కులానికి చెందిన జ్యోతి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే వారు పెండ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అయితే, ఆయా వర్గాల కుల సంఘాలు, గ్రామ పెద్దలు ఆ పెండ్లిని వ్యతిరేకించారు. అయితే, దీనిని లెక్కచేయని వారు పెండ్లి చేసుకుని గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలోనే వారిని గ్రామ పంచాయతీ ద్వారా కుల బహిష్కరణ చేశారు. కులాంతర వివాహం చేసుకున్న ఈ జంటకు ఇప్పుడు ఐదేండ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, ఇప్పటికే ఆ బాలుడిని ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడానికి అనుమతించడం లేదు.
ఈ క్రమంలోనే వారిని మళ్లీ కులంలో చేర్చుకోవడానికి గ్రామ పెద్దలు డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో గ్రామ పెద్దలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజేష్ ప్రజాపతి తన భార్య జ్యోతి ఉతయతో కలిసి దామోహ్‌లోని జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను ఆశ్రయించారు. తన కుటుంబం నుంచి రూ.2 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ప్రజాపతి తన ఫిర్యాదులో ఆరోపించారు.
"మేము ఇప్పటికే ఆరు సంవత్సరాలుగా బాధను అనుభవిస్తున్నాము. తమపై ఉన్న బహిష్కరణను తొలగించడానికి షరతులు విధిస్తూ.. గ్రామ పంచాయితీ కోరడంతో నాన్న దానిని అంగీకరించాడు. మేము కమ్యూనిటీకి తిరిగి రావాలని కోరుకున్నాము. కాబట్టి మేము 'భగవద్ కథ' మరియు గ్రామస్తులకు విందు ఏర్పాటు చేయడానికి అంగీకరించాము. దానికి సరిపడా డబ్బులు లేకపోవడంతో అప్పు తీసుకున్నాం. అయితే మమ్మల్ని అడిగినంత చేసినా.. కొందరు గ్రామస్థులు సీన్ క్రియేట్ చేసి రూ. 2 లక్షలు చెల్లించే వరకు తమ కుల సంఘంలోకి రావడం పూర్తికాదని చెప్పారు' అని ప్రజాపతి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ప్రజాపతి, ఆయన భార్య నుంచి ఫిర్యాదు అందిందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని దామోహ్ డీఎస్పీ డీఆర్ తనిబార్ (Damoh DSP DR Tanibar) ధ్రువీకరించారు. సంఘం సభ్యులు అక్రమార్జనకు పాల్పడినట్లు గుర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. "మేము ఫిర్యాదును స్వీకరించాము. ఏదైనా అక్రమం కనుగొనబడితే మరియు ఆరోపణలు నిజమని తేలితే తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి”అని డీఆర్ తనీబార్ చెప్పారు.
