వినూత్న సంస్కరణలు, ప్రజా రంజక పాలనతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముందుకు వెళ్తున్నారు. అందుకే వరుసగా సీఎం పీఠాన్ని అధిష్టిస్తూ వస్తున్నారు.

తాజాగా గోవుల సంరక్షణకు ఒక ప్రత్యేక కేబినెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ బుధవారం ప్రకటించారు. పశు సంవర్థకశాఖ, అటవీ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమ విభాగాలు ఇందులో భాగంగా ఉంటాయని సీఎం తెలిపారు.

ముఖ్యంగా ఆవుల సంరక్షణను ప్రోత్సహించేందుకు ఈ కేబినెట్‌ కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మొదటి సమావేశం ఈ నెల 22 మధ్యాహ్నం 12 గంటలకు అగర్‌మాల్వాలోని గోపాష్టమిలో జరగనుందని ఆయన ట్వీట్ చేశారు.

ప్రేమ పెళ్లిళ్ల పేరిట జరిగే మత మార్పిడిలకు (లవ్‌ జిహాద్‌) వ్యతిరేకంగా ఓ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించిన మరుసటిరోజే ఈ కేబినెట్‌ను మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.