పంచాయతీ ఎన్నికల రద్దు.. ఆ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకున్న మధ్యప్రదేశ్ సర్కార్..!
మధ్యప్రదేశ్ పంచాయతీ ఎన్నికలకు (Madhya Pradesh Panchayat polls) సంబంధించి కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
మధ్యప్రదేశ్ పంచాయతీ ఎన్నికలకు (Madhya Pradesh Panchayat polls) సంబంధించి కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కేబినెట్ నిర్ణయానికి సంబంధించిన ప్రతిపాదనకు శివరాజ్ సింగ్ నేతృత్వంలోని మంత్రివర్గం ఆదివారం ఆమోదం తెలిపింది. అనంతరం ఈ ప్రతిపాదనను గవర్నర్ ఛగన్‌భాయ్ మంగూభాయ్ పటేల్‌కు పంపారు. ఈ ప్రతిపాదనపై గవర్నర్ ఆమోద ముద్ర వేసి ఎన్నికలను రద్దు చేయమని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇక, మధ్యప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ఓబీసీ (other backward classes) రిజర్వేషన్లకు సంబంధించి ప్రతిష్టంభన కొనసాగుతుంది. అయితే ఈ నెల 4వ తేదీన పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. జనవరి 6, 28, ఫిబ్రవరి 16 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. జనవరి 6వ తేదీన జరగనున్న మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
అయితే డిసెంబర్ 17న పంచాయతీ ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లను నిషేధిస్తూ, వెనుకబడిన తరగతులకు రిజర్వ్ చేసిన పోస్టులకు మళ్లీ నోటిఫికేషన్లు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. రొటేషన్ విధానాన్ని రద్దు చేసి 2014లో మాదిరిగా ఎన్నికలు నిర్వహించాలని శివరాజ్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ నేతలు హైకోర్టు, సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
ఓబీసీలకు రిజర్వేషన్ లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోమని రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలన్నది వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. కరోనా కాలంలో ఇతర రాష్ట్రాల్లో పంచాయితీ ఎన్నికలలో మంచి ఫలితాలు రాలేదని అన్నారు. ఒకరి జీవితం కంటే ఎన్నికలు పెద్దవి కాదని వ్యాఖ్యానించారు.
ఈ రోజు కేబినెట్ భేటీ అనంతరం నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. ‘ఈరోజు పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా ఒక ప్రతిపాదనను సమర్పించారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయానికి సంబంధించిన ప్రతిపాదనను గవర్నర్‌కు పంపాం' అని తెలిపారు.
ఇక, సీఎం శివరాజ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో ఓబీసీలకు 22 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆలోచిస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలో ఓబీసీ గణంకాలను సేకరిస్తుంది. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై కూడా దృష్టి సారింది.