బీజేపీ గెలిస్తేనే వేసుకుంటా .. ఆరేళ్లుగా షూ లేకుండా దీక్ష, దగ్గరండి బూట్లు తొడిగిన శివరాజ్ సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు పాదరక్షలు ధరించనని శపథం చేసిన రాష్ట్రంలోని అనుప్పూర్ జిల్లా యూనిట్ చీఫ్ దాదాపు ఆరేళ్ల తర్వాత షూ వేసుకున్నారు. మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో ఆయన షూ ధరించారు.
మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు పాదరక్షలు ధరించనని శపథం చేసిన రాష్ట్రంలోని అనుప్పూర్ జిల్లా యూనిట్ చీఫ్ దాదాపు ఆరేళ్ల తర్వాత షూ వేసుకున్నారు. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆయన ఎట్టకేలకు శపథాన్ని నెరవేర్చుకున్నారు. భారతీయ జనతా పార్టీ అనుప్పూర్ జిల్లా అధ్యక్షుడు రాందాస్ పూరి ఆరేళ్ల తర్వాత మళ్లీ బూట్లు వేసుకున్నారు. మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో ఆయన షూ ధరించారు. దీనికి సంబంధించిన వీడియోను చౌహాన్ షేర్ చేశారు.
రాందాస్ పూరీ 2017లో పాదరక్షలు ధరించడం మానేశారని, బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు షూ ధరించనని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. అయితే 2020లో పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత (కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత) రాందాస్ పూరీ బూట్లు వేసుకోలేదని శివరాజ్ సింగ్ చౌహన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
రాందాస్ పూరి జీ కష్టపడి పనిచేసే, అంకితభావంతో కృషి చేసే బీజేపీ కార్యకర్త అని చౌహాన్ ప్రశంసించారు. 2017 నుంచి బూట్లు, చెప్పులు ధరించడం మానేశారని.. గడిచిన ఆరేళ్లుగా వేసవి, చలికాలం, వర్షాకాలంలో ప్రతి సీజన్‌లోనూ చెప్పులు లేకుండానే తిరిగేవారని మాజీ సీఎం తెలిపారు. ఇప్పుడు ఎట్టకేలకు ఆయన శపథం నెరవేరిందని, దీంతో షూ వేసుకోమని తాము కోరామని చౌహాన్ వెల్లడించారు.