తోడబుట్టిన అక్క.. భర్తతో సంతోషంగా ఉంటే  చూసి ఆనందించాల్సింది పోయి అసూయ పెంచుకుంది. అక్క మొగుడిపై మోజు పెంచుకొని... బావని తన సొంతం చేసుకోవాలని అనుకుంది. అందుకు అడ్డుగా ఉన్న సొంత అక్కనే తప్పించాలని అనుకుంది. తన అక్క కడుపుతో ఉందన్న కనికరం కూడా లేకుండా అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లా కైత్రాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కైత్రా ప్రాంతానికి చెందిన అభిలాష927), షతక్షి(19) అక్కాచెల్లెళ్లు. కొద్ది నెలల క్రితం అభిలాషకు వివాహమైంది. ఇటీవల ఆమె గర్భం దాల్చడంతో పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో అక్క అభిలాష భర్త పై షతక్షి మోజు పెంచుకుంది. అక్కని అడ్డు తొలగించి బావను సొంతం చేసుకోవాలని భావించింది.

ఇందులో భాగంగా వాష్ రూంకి వెళ్లిన తన అక్కని అతి కిరాతకంగా కత్తితో పొడిచింది. మెడపైనా, కడుపులో పొడిచి హత్య చేసింది. ఆమె అరుపులు విన్న తల్లిదండ్రులు చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని తీవ్రగాయాలపాలైన అభిలాషను ఆస్పత్రిలో చేర్చారు. అయితే... అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో.. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.

అక్కని దారుణంగా పొడిచిన అనంతరం షతక్షి ఘటనాస్థలి నుంచి పారిపోవాలని ప్రయత్నించింది. అయితే... చుట్టుపక్కల వారు ఆమెను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. తన అక్కను  చంపడానికి ఆమె గతంలోనే మూడు సార్లు ప్రయత్నించి విఫలం చెందినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. చివరగా.. బాత్రూమ్ లో ప్లాన్ వేసి మరీ చంపేసింది.