Asianet News TeluguAsianet News Telugu

నేషనల్ వార్ మెమోరియల్ కోసం సుదీర్ఘ పోరాటం.. ఇలా మొదలైంది.. !

అమర జవాన్ జ్యోతి దీపాన్ని నేషనల్ వార్ మెమోరియల్‌లో కలిపేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన దుమారం  రేపింది. ప్రతిపక్షాలు కేంద్రంపై దాడికి దిగాయి. ఈ నేపథ్యంలోనే నేషనల్ వార్ మెమోరియల్ నిర్మాణానికి జరిగిన సుదీర్ఘ పోరాటాన్ని మననం చేసుకుంటే ఆసక్తికర విషయాలు వెలికి వస్తున్నాయి. నేషనల్ వార్ మెమోరియల్ నిర్మాణం కోసం 2009లో అప్పటి రాజ్యసభ ఎంపీ, ప్రస్తుత కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఒత్తిడి చేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాసిన లేఖలోనేషనల్ వార్ మెమోరియల్ నిర్మించాలని, అందుకోసం సూచనలు సలహాలు చేయడమే కాదు.. అవసరమైతే ఏ సహకారానికైనా తాను సిద్ధం అని ప్రకటించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నేషనల్ వార్ మెమోరియల్‌పై సకాలంలో పూనుకోలేదు.
 

Long struggle for a national war memorial, efforts of MP Rajeev chandrasekhar
Author
New Delhi, First Published Jan 21, 2022, 4:03 PM IST

న్యూఢిల్లీ: అమర్ జవాన్ జ్యోతి(Amar Jeevan Jyoti), నేషనల్ వార్ మెమోరియల్‌(National War Memorial)లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. అమర్ జవాన్ జ్యోతి దీపాన్ని నేషనల్ వార్ మెమోరియల్‌‌లో విలీనం చేస్తామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ప్రకటనతో కాంగ్రెస్(Congress) సహా ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం అమర జవాన్ల(Martyrs)ను అగౌరవపరుస్తున్నదని మండిపడ్డాయి. రాహుల్ గాంధీ ఏకంగా.. కొందరికి దేశంపై ప్రేమ, బలిదానాలు అర్థం కావు అని ట్వీట్ చేశారు. అమర జవాన్ జ్యోతిని ఆర్పేస్తారని పేర్కొన్నారు. అయితే, మన సైనికుల కోసం మరోసారి జ్యోతిని వెలిగిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ.. ఈ అంశాన్ని రాజకీయం చేసి లబ్ది పొందాలని అనుకుంటున్నదా? లేక నిజంగానే కాంగ్రెస్‌కు అమర జవాన్లపై అంతటి ప్రేమ ఉన్నదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో నేషనల్ వార్ మెమోరియల్ కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాన్ని.. అందుకు పూనుకున్న ప్రస్తుత కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(Union Minister Rajeev Chandrasekhar) లేఖలు ముందుకు వచ్చాయి.

ప్రస్తుత కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ 2009(అప్పుడు రాజ్యసభలో ఎంపీ)లో కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ వార్ మెమోరియల్ నిర్మాణం గురించి లేఖలు రాశారు. ఆ నిర్మాణంలో ఏవైనా సమస్యలు ఉన్నా తాను అన్ని విధాల సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అప్పటి కేంద్ర రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి ఎంఎం పల్లం రాజులకు లేఖ రాశారు. 

భారత ఉపఖండంలో ఎన్నో ఘర్షణలు.. అంతర్గతంగా, విదేశాల వల్ల కూడా జరిగాయని, ఈ పోరాటాల్లో ఎంతో మంది శౌర్యవంతులైన జవాన్లు తమ ప్రాణాలు త్యాగం చేశారని రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాశారు. కానీ, వారి పోరాటాలను, వారి త్యాగాలకు పెద్దగా గుర్తింపు లేకుండానే పోతున్నదని ఆవేదన చెందారు. అమెరికా లాంటి కొన్ని దేశాల్లో వారి త్యాగాలను స్మరించుకోవడానికి వార్ మోమరియల్స్ ఉన్నాయని ప్రస్తావించారు. కాబట్టి, మన దేశంలోనూ అమర జవాన్లను స్మరించడానికి, వారికి నివాళిగా నేషనల్ వార్ మెమోరియల్ నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు ఇప్పటి వరకు మన దేశంలో నేషనల్ వార్ మెమోరియల్ లేకపోవడం బాధాకరమని తెలిపారు. 

అంతేకాదు, దేశరాజధాని ఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్ నిర్మించడానికి స్థల సేకరణ అసలు సమస్యగా ఉన్నదని తనకు తెలుసు అని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. అందుకు స్వయంగా ఆయన ఒక సూచన చేశారు. యమునా నదీ తీరాన 50 నుంచి 60 ఎకరాలు సేకరించి నేషనల్ మిలిటరీ మెమోరియల్ పార్క్ నిర్మించడం సముచితంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇది రాజ్‌ఘాట్, శాంతివన్‌లలాగే ఉంటుందని తెలిపారు. అంతేకాదు, మెమోరియల్‌ నిర్మాణం డిజైన్, లే ఔట్‌లూ ఎలా ఉండాలో కొన్ని ఐడియాలను ఆయన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. ఢిల్లీలో ఇంతటి కీలకమైన నేషనల్ మిలిటరీ మెమోరియల్ వార్ నిర్మాణంలో ఎలాంటి సహకారానికైనా తాను సదా అందుబాటులో ఉంటారని వివరించారు.

నేషనల్ వార్ మెమోరియల్ నిర్మించాలని 1960లో తొలిసారిగా భారత సైనిక దళాల నుంచి ప్రతిపాదన వచ్చింది. అప్పటి నుంచి అనేక సార్లు దీనిపై చర్చ జరిగినా.. కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వంలోనూ ఇది నానుతూ వచ్చింది. అనేక మార్లు దీనిపై ఒత్తిళ్లు వచ్చాయి. ఎట్టకేలకు 2014 ఎన్నికలకు ముందు అప్పటి కేంద్ర రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ దీనిపై కీలక ప్రకటన చేశారు. నేషనల్ వార్ మోమోరియల్ నిర్మాణానికి కేంద్ర మంత్రుల బృందం అంగీకరించిందని, ఇండియా గేట్ దగ్గర దీన్ని నిర్మిస్తామని చెప్పారు. కానీ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో నేషనల్ వార్ మెమోరియల్‌, మ్యూజియానికి మోడీ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు.. రూ. 500 కోట్లు కేటాయించడానికి ఆమోదముద్ర వేసింది. 2019 జనవరిలో నేషనల్ వార్ మెమోరియల్ నిర్మాణం పూర్తయింది.

Follow Us:
Download App:
  • android
  • ios