భోపాల్: లవ్ జిహాద్‌ను అరికట్టడం కోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక బిల్లును ప్రవేశపెడతామని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా చెప్పారు.

మంగళవారం నాడు ఆయన ఈ విషయమై కీలక ప్రకటన చేశారు. కర్ణాటక, హర్యానా ప్రభుత్వాలు కూడ లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టాలు చేస్తామని ప్రకటించిన కొన్ని వారాల తర్వాత అదే బాటలో పయనిస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. పెళ్లి పేరుతో మత మార్పిడికి పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొస్తామని ఆయన ప్రకటించారు.

బలవంత మత మార్పిడుల కోసం పవిత్రమైన వివాహ ధర్మాన్ని అడ్డుపెట్టుకోవడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.పెళ్లి కోసం మతాన్ని మార్చుకోవాలని భావించేవారంతా నెల రోజుల ముందుగానే కలెక్టర్ కు ధరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ధర్మ స్వతంత్ర 2020 బిల్లుకు రూపకల్పన చేస్తోంది.లవ్ జిహాద్ అనే పదాన్ని ప్రస్తుతమున్న ఏ చట్టం ప్రకారం నిర్వహించలేదని  ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంట్ కు కేంద్రం తెలిపింది. ఈ విషయమై ఏ కేంద్ర ఏజెన్సీ కూడ కేసు నమోదు చేయలేదని తెలిపింది.