ఐదేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించిన కర్ణాటక యువ ఐఏఎస్ అధికారి డీకే రవి ఉదంతం సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఆయన భార్య డీకే కుసుమ రాజకీయ ప్రవేశం చేశారు. ఈ మేరకు  కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

త్వరలో జరుగనున్న రాజమహేశ్వరీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆమెను కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిలో బరిలోకి దింపే అవకాశం ఉంది. ఎమ్మెల్యే సీటు హామీ మేరకే కుసుమ పార్టీలో చేరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇప్పటికే ఆమె పేరును కాంగ్రెస్ హైకమాండ్‌కు సిఫారసు చేసినట్లు డీకే శివకుమార్ వెల్లడించారు. ఉన్నత విద్యావంతురాలైన కుసుమను ఆ స్థానంలోనే నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

కాగా కర్ణాటక కేడర్‌కు చెందిన డీకే రవి 2015లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన అప్పట్లో పెను దుమారాన్నే రేపింది. ప్రభుత్వ ఒత్తిడి మేరకే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారని రవి తల్లిదండ్రులు ఆరోపించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతితో ప్రేమ వ్యవహారం కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన  కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) రవిది ఆత్మహత్యగానే నిర్ధారించింది. వ్యక్తిగతమైన కారణాల వల్లనే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు నివేదించింది.